ప్రజాశక్తి-నెల్లూరు : పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నానని అన్నారు. తాను రెండు నెలల ముందే వైసీపీకి దూరంగా ఉన్నానని చెప్పారు. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేసేందుకు వైసీపీ పార్టీకి ప్రత్యేకంగా ఏమైనా నిబంధనలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ నుండి సస్పెండ్ చేయడంపై ముఖ్యమంత్రి జగనే సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కోట్ల రూపాయలు తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు సరికావని.. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇచ్చారని ప్రశ్నించారు.










