Aug 01,2022 07:22

ఇవ్వాళ
స్వతంత్య్ర భారతావని
గుక్కపట్టి ఏడుస్తోంది
సుంకాల పేరుతో
జలగల్లా పేదల రక్తాన్ని పీల్చి
జీవచ్ఛవాలుగా మార్చినందుకు
గుక్కపెట్టి ఏడుస్తోంది

మానవత్వం లేని మృగాల మధ్యన
యంత్రాలైన మర మనుషుల చెంతన
బక్కచిక్కిన డొక్కలు సాక్షిగా...
భారతావని కుమిలిపోతోంది
ఎదుగుతున్న దేశాన్ని ..
దిగదోస్తున్న దృశ్యాన్ని చూసి
కంట తడి పెడుతోంది

వెలుగొందుతున్న భారతమ్మ
నేతల పొంతన లేని మాటలకు
నేడు రగులుతున్న భారతాన్ని
చూస్తున్నందుకు
నిజంగానే గుక్కపట్టి ఏడుస్తోంది
ధనార్జనే ద్యేయంగా...
పాలకుల కుటిల పాలనను
జీర్ణించుకోలేకా... కన్నీరు పెడుతోంది.

ఎన్ని ప్రశ్నల సంధించినా..
పూటకో మాటతో..
రోజుకో పన్నుతో...
సామాన్యుల నడ్డి విరిచే
పాలకుల ఏలుబడికి
చరమగీతం పాడాలంటూ
భారతావని నుదుట
ఆనందం సింధూరమై మెరవాలంటూ
కదిలిరమ్మంటూ నినదిస్తోంది...
ఎరుపెక్కిన కళ్ళతో !

- కంబాల తిమ్మారెడ్డి
83097 54313