న్యూఢిల్లీ : పర్యావరణ ముప్పు నేపథ్యంలో సముద్రాల పరిరక్షణకు చట్టబద్ధమైన సముద్ర జీవవైవిధ్య ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి 193 సభ్య దేశాలు సోమవారం ఆమోదించాయి. పర్యావరణ పరిరక్షణ కోసం జరిగిన ఈ ఒప్పందం చారిత్రాత్మకమైనదని ఐక్యరాజ్యసమితి ఈ సందర్భంగా అభివర్ణించింది. నేషనల్ జ్యూరిస్డిక్షన్ (బిబిఎన్‌జి) దాటిన ప్రాంతాల సమద్ర జీవ వైవిధ్యంపై ఇంటర్‌గవర్నమెంటల్ కాన్ఫరెన్స్ ఆమోదించిన 'హై సీస్' ఒప్పందం ఓ మైలురాయి. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ఒప్పందాన్ని యుఎన్ సభ్య దేశాలు ఆమోదించాయి. కేవలం మహసముద్రాలను రక్షించడమే 'హై సీస్' ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుందని యుఎన్ న్యూస్ నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సోమవారం ప్రతినిధులతో మాట్లాడుతూ... 'సముద్రం మన గ్రహానికి జీవనాధారం. ఈరోజు దానికి మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు. సముద్రానికి పోరాడే అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు. ఇక సముద్ర పర్యావరణాన్ని రక్షించడం- సంరక్షించడం, బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడం, సముద్ర పర్యావరణ వ్యవస్థల సమగ్రతను కాపాడడం, సముద్ర జీవ వైవిధ్యం యొక్క స్వాభావిక విలువను పరిరక్షంచడంపై వంటి 75 అంశాలతో కూడిన ఉన్న ఈ ఒప్పందాన్ని యుఎప్ సభ్య దేశాలు ఆమోదించాయి.
కాగా, వంద దేశాలకు చెందిన సంధానకర్తలతో ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఐదు రౌండ్ల సుదీర్ఘ చర్చల తర్వాత ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది మార్చిలో అంగీకరించడం జరిగింది. అయితే ఈ ఒప్పందం చట్టబద్ధంగా ఇప్పుడు అమలులోకి రావడానికి ముందు 60 దేశాలు సంతకాలు చేసి ఆమోదించాలి. భూ ఉపిరితలంలో సగానికిపైగా ఉన్న మహాసముద్రాలు 61 శాతం ఉన్నప్పటికీ, అవి అంతర్జాతీయ జలాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే రక్షణలో ఉన్నాయి. ఈ తాజా ఒప్పందం సముద్ర వనరుల పరిరక్షణ, స్థిరమైన వినియోగానికి దోహదం చేస్తుందని, అదే సమయంలో పాల్గొన్న అన్ని దేశాల హక్కులు, వాటి ప్రయోజనాలను పరిరక్షించుకోవచ్చునని భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. సముద్ర పరిరక్షణకు చర్య తీసుకోకపోతే 2050 నాటికి సముద్రంలో చేపల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2021లో 17 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ప్రపంచ సముద్ర జల్లాలోకి ప్రవేశించింది. అంటే సముద్ర జలాల్లో 85 శాతం చెత్త పేరుకుపోయిందని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజి) తాజా నివేదిక వెల్లడించింది. అలాగే 2040 నాటికి ప్రతి ఏటా సముద్ర జలాల్లో రెండింతలు లేదా మూడింతలు చెత్త పేరుకుపోవడం పెరుగుతందని ఎస్‌డిజి నివేదిక పేర్కొంది. అదే సమయంలో గ్లోబల్ హీటింగ్ పెరగడం వల్ల సముద్ర ఉష్ణోత్రలు కూడా పెరుగుతాయి. దీంతో తీవ్రమైన తుఫానులు సంభవించడం, తీర ప్రాంత భూములు లవణీకరణం చెందడం జరుగుతాయి. మన వాతావరణంలోని మొత్తం ఆక్సిజన్ సగానికి పైగా సముద్రంలో జీవులచే సృష్టించబడుతుంది. ఇది ప్రస్తుతం మన వాతావరణంలో కనిపించే దానికంటే 50 రెట్లు ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ను నిల్వ చేస్తుంది. సముద్ర ఎంత వెచ్చగా ఉంటే అది అంత తక్కవ కార్బన్‌డయాక్సైడ్‌ను నిల్వ చేయగలదు. ఇక తాజా ఒప్పందం ప్రకారం దేశాలు, ఆయా పార్టీలు తమ పరిధికి మించి విస్తరించేలా ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది. అలాగే కాలుష్య చెల్లింపు సూత్రాల నిబంధనలను కలిగి ఉండాలి.










