Jun 21,2023 17:29

ఇంటర్నెట్‌డెస్క్‌ : నైజీరియా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దాంతో ఐక్యరాజ్యసమితి నైజీరియా ప్రజల ఆహారం కోసం 20 మిలియన్ల డాలర్ల అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌, సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌ తెలిపారు. ఈశాన్య నైజీరియాలో పోషకాహార లోపంతో అక్కడి ప్రజలు బాధపడుతున్నారు. దీంతో అత్యసర ఆహార భద్రతకు, పోషకాహారం కోసం ఐక్యరాజ్యసమితి 20 మిలియన్‌ డాలర్లను అందజేసింది. సెంట్రల్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ ఫండ్‌ నుండి 9 మిలియన్‌ డాలర్లు, నైజీరియా హ్యుమానిటేరియన్‌ ఫండ్‌ నుండి 11 మిలియన్‌ డాలర్లను కలిపి మొత్తం 20 మిలియన్‌ డాలర్లను నైజీరియాకు కేటాయించింది. ఇలాంటి సమయంలో నైజీరియాకు ఆహారం, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ మద్దతును కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. కానీ పూర్తిస్థాయి ఆకలి, పోషకాహార లోపాన్ని నివారించడానికి మాత్రం ఈ నిధులు సరిపోవు. వీటిని నివారించడానికి మానవతా భాగస్వాములు మరింత అవసరం అని హక్‌ తెలిపారు.
కాగా, ఈ సందర్భంగా ఈశాన్య నైజీరియాలో ఈ ఏడాదిలో దాదాపు 7 లక్షల మంది చిన్నారులు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. దాదాపు ఐదు లక్షల మందికంటే పైగా అత్యవసర ఆహారలేమితో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడించాయని ఫర్హాన్‌ హక్‌ ఈ సందర్భంగా ఉటంకించారు.