Jul 04,2023 13:41

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కి తోషఖానా కేసులో ఇస్లామాబాద్‌ హైకోర్టు (ఐహెచ్‌సి) భారీ ఊరటనిచ్చింది. ఇమ్రాన్‌ఖాన్‌పై నమోదైన కేసు ఆమోదయోగ్యం కాదని ఇస్లామాబాద్‌ హైకోర్టు మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు పాకిస్తాన్‌ న్యూస్‌ ఛానెల్‌ ఎఆర్‌వై వెల్లడించింది. కాగా, పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ అధికారుల నుంచి ప్రభుత్వ అధికారులకు అందజేసే బహుమతుల వివరాలను ఉద్దేశపూర్వకంగా క్యాబినెట్‌ నియంత్రణలో ఉండే తోషఖానా విభాగానికి వెల్లడించలేదని, వాటిని ఆయన బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఇమ్రాన్‌పై పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం కేసును దాఖలు చేసింది. ఈ కేసును క్రిమినల్‌ కేసుగా ట్రయల్‌ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ట్రయల్‌ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇమ్రాన్‌ఖాన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ తీర్పును జూన్‌ 23న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమర్‌ ఫరూక్‌ రిజర్వ్‌ చేశారు. ఈద్‌ ఉల్‌ అదా వేడుకల తర్వాత ఈ కేసును పరిశీలిస్తామని ఫరూక్‌ వెల్లడించినట్లు ఎఆర్‌వై న్యూస్‌ తెలపింది. తాజాగా హైకోర్టు ఈ కేసు విచారణర్హమైనది మంగళవారం ప్రకటించింది.
కాగా, హైకోర్టు తీర్పు అనంతరం ఇమ్రాన్‌ తరపు న్యాయవాది గోహర్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'ఇమ్రాన్‌ ఈ కేసులో విజయం సాధించారు' అని ఆయన అన్నారు.