Jun 23,2023 14:28

పారిస్‌  :   అమెజాన్‌ మొత్తం మానవాళికి చెందినదని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా పేర్కొన్నారు. అలాగే 'జీరో డిఫారెస్టేషన్‌'ను సమర్థించారు. పారిస్‌లో గురువారం నిర్వహించిన ''పవర్‌ అవర్‌ ప్లానెట్‌ '' ఉత్సవంలో పాల్గన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు. అతిపెద్ద రెయిన్‌ ఫారెస్ట్‌ అమెజాన్‌ గురించి ప్రస్తావించారు. అమెజాన్‌ బ్రెజిల్‌ సార్వభౌమ ప్రాంతమని, కాని అదే సమయంలో మొత్తం మానవాళికి చెందినదని అన్నారు. ఆ కారణంగా రెయిన్‌ ఫారెస్ట్‌ను పరిరక్షించేందుకు అన్ని చర్యలు చేపడతామని అన్నారు. అడవులను కలిగి ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధనిక దేశాలు పర్యావరణ నష్టాన్ని కలిగించినందుకు పరిహారంగా ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

గత 200 ఏళ్లుగా, పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనప్పటి నుండి ధనిక దేశాలు ప్రపంచాన్ని కాలుష్యమయం చేశాయని అన్నారు. అయితే ఆ జాబితాలో ఆప్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు లేవని చెప్పారు. భూగ్రహానికి చారిత్రక పరిహారం కింద ఆర్థిక సహాయం చెల్లించాలని అన్నారు.

2030 వరకు బ్రెజిల్‌లో జీరో డిఫారెస్టేషన్‌ ఉంటుందని, దానిని సాధించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు చేడుతుందని అన్నారు. 2025లో అమెజానియన్‌ సిటీ బెలెమ్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు కాప్‌ 30లో పాల్గనాల్సిందిగా లూలూ అన్ని దేశాలను ఆహ్వానించారు. అమెజాన్‌ పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యం గొప్పతనం, నదుల గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.