పెళ్లే కాదు, మరణమూ ఆగిపోతుంది
శ్మశానం దాకా వెళ్లలేక ...
మన జీవనాడుల్ని
కొద్ది కొద్దిగా రసం పీల్చినట్టు పీల్చి
పిప్పిని చేసి అవతల పడేసే కఠినత్వం
మన హక్కు భుక్తాల్ని ఆదమరిచి
చిత్తు కాగితాల్ని చించినట్టు
చించిపారేసే నియంతృత్వం
ఉత్పత్తిని నాశనం చేసి
ఉత్తుత్తి కాగితాల పంపకాలు
పథకాల పేరిట దారి మళ్లింపులు
మన ప్రాణాల హరింపులు
కాకులను కొట్టి గద్దల్ని మేపే వ్యూహాలు
మన జీపిఎఫ్ఫులే కాదు, ఏ పిఎఫ్ఫులైనా
వాళ్ల భోషాణాల్లోకి
మన కంకాళాలై దొర్లిపోతాయి
వాయిదాలు
మన ఆకుపచ్చని బతుకుల్ని
ఎండుటాకుల్లా మార్చేస్తాయి
ఎవరడుగుతారు వాళ్లని
ఎవరు ప్రశ్నిస్తారు వాళ్లని
ఇప్పుడు నోళ్లన్నీ
కుట్లేసుకున్న గర్భ సంచులు
మాటలు పుట్టవు మౌనాలే రక్త స్రావాలు
అక్కడా ఇక్కడా ఎక్కడనేముంది
నోళ్లను మూయించే కుట్ర
దేశమంతా జరుగుతోంది!
ఇకనైనా కుట్రల్ని ఛేదించే
పిడికిళ్లు మొలవనంతకాలం
నియంతల్ని నిలదీసే ప్రశ్నలతో
దిక్కులు పిక్కటిల్లనంతకాలం
పెళ్లే కాదు, మన బతుకులే ఆగిపోతాయి
శవాల కంపుకొడుతూ
దేశమే రాబందులు తిరుగుతున్న
యుద్ధ భూమవుతుంది!
(ఒక ఉద్యోగి జిపిఎఫ్ సకాలంలో అందక
కూతురు పెళ్లి వాయిదా పడిందన్న వార్త చదివాక)
- చిత్తలూరి
82474 32521










