నీళ్ల గురించి కాదు మాట్లాడేదీ
ఎక్కడైనా.. ఎవరివైనా...
కన్నీళ్ల గురించి కదా మాట్లాడాల్సిందీ!
కడుపు నిండిన వాళ్ల గురించి కాదు..
ఇక్కడి డొక్కల కరువు గురించి మాట్లాడండి
నదీ జలాల గురించి మాట్లాడినట్టే
మా సీమ కన్నీటి వెతలు గురించి మాట్లాడండి
నికర జలాల గురించి మాట్లాడినట్టే
నికర కరువుని గురించి మాట్లాడండి
సముద్రం పాలయ్యే నీళ్లతో పాటు ...
కనుమరుగయ్యే మా ప్రాంత మనిషి గురించి
తప్పక మాట్లాడండి !
ఒక్కసారి..
ఒక్కసారి మా సీమకు రండి!
ఇసుక మేటలు కమ్మిన
పంటపొలాల్ని కళ్లలోకి తీసుకుని
పగిలిన మా బతుకుల్ని చూసిపొండి
మబ్బుపట్టిన ఆకాశానికి కూడా
మేమంటే చులకనేమో?
నమ్మకంగా నాలుగు చినుకులు రాల్చిపోదు!
అరకొర వానలకే ఆరుగాలం శ్రమిస్తూ
ఆకలి కడుపులు పూడ్చుకోవడానికి
పల్లెలన్నీ వలసెల్లి పట్నపు కాంక్రీటు
గోడల కింద తలదాచుకున్న
దైన్యాన్ని కళ్ళారా చూడండి!
సీమ చరిత్ర పుటల్ని ఓసారి తడిమి చూడండి
పచ్చని పంట చేలై ఊరేగాల్సిన రైతు బిడ్డలు
బీడుబడ్డ భూముల్లో ఉరితాళ్లై వేలాడుతున్న
సజీవ దృశ్యాలను దేశానికి తెలియ పరచండి
చుక్క దాహం కోసం
వేలమైళ్ళ పిడచగట్టిన నడక మాది
మట్టిని నమ్ముకుని
బతుకు సేద్యం చేస్తున్న కాలం నుంచి
అదే వెత మాది!
ఇక్కడ ఏటా..
ఏ చెరువూ నిండదు చెలమా ఊరదు
ఏ వాగూ ఉరకదు వంకా పారదు
ఊళ్లకు ఊళ్ళు శ్మశానాలుగా మారడం తప్ప!
ఇక
నీళ్లనొదులుకుని అప్పుల బావిలోకి దూకలేం
మా పంట పొలాలను కన్నీళ్లతో తడపలేం
నీటి వాటాకై నియమబద్ధ పోరాటానికై
కదిలే అడుగుల్ని ఆపలేరిక..!
అందరూ
ఒక్కటై ముందుకు కదలాల్సిందే
తడారిన
సీమ గొంతునీ తడపాల్సిందే!
- ఆది ఆంధ్ర తిప్పేస్వామి
77802 63877










