Jul 25,2022 07:27

ప్రసిద్ధ బాల సాహిత్య వేత్త రెడ్డి రాఘవయ్య (82) ఆదివారం మధ్యాహ్నం కన్ను మూశారు. గోరుముద్దలు తినే బాలల దగ్గర నుంచి కౌమార ప్రాయపు పిల్లల దాకా .. వారు వినే, చదువుకునే కథలూ, గేయాలూ, కబుర్లూ అనేకం రాసి, పుస్తకాలుగా వేశారాయన. ఆయన పిల్లల మనసంటి మనసున్న మనిషి. మృదుభాషి. కేంద్ర బాల సాహిత్య అవార్డు గ్రహీత. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాదులోని బాలానగర్‌లో తన ఇంటివద్ద కన్ను మూశారు.

రెడ్డి రాఘవయ్య గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో మహా లక్ష్మమ్మ, కిష్టయ్య దంపతులకు 1940 జులై 1న జన్మించారు. ప్యాపర్రు, నిడుబ్రోలులో పాఠశాల విద్య అభ్యసించారు. నెల్లూరు పారిశ్రామిక శిక్షణా సంస్థలో శిక్షణ పొంది, హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సంస్థలో ఉద్యోగంలో చేరారు. బెంగుళూరు, హైదరాబాదులలో పనిచేశారు. 2000 సంవత్సరంలో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వచ్చినప్పుడు- విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో సాహితీ స్రవంతి ఘనంగా సన్మానించింది. ఆ సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఆయన బాల సాహిత్యం గురించి మాట్లాడారు.

రాఘవయ్య తొలినుంచీ బాలసాహిత్యంలోనే కృషి చేశారు. 1955 డిసెంబర్‌ 25వ తేదీన విశాలాంధ్ర దిన పత్రికలో వచ్చిన సలహా అనే కథ వీరి మొదటి రచన. 1979లో వీరి పదాలు, పద్యాలు కలిపి 'బాల నీతిమాల' పేరుతో మొదటి పుస్తకం వెలుగు చూసింది. అది మొదలు మణిదీపాలు, నవరత్నాలు, బాలల లోకం, పసిడి పాటలు, మంచి పూలు, జ్ఞానులు - విజ్ఞానులు, పూలతోట, రంగుల రాట్నం... ఇలా సంవత్సరానికి ఒక పుస్తకం చొప్పున వెలువడ్డాయి. రెండు రోజుల క్రితమే డీటీపి పూర్తి చేసుకున్న ఆయన పుస్తకాన్ని ప్రూఫులు దిద్దుతూ కుమార్తె రాజేశ్వరితో ఇదే నా చివరి పుస్తకం అని పదే పదే అంటుండేవారు.

రాఘవయ్య స్వయంగా బాలసాహితీ వేత్త కాకుండా, ఎంతోమంది యువ బాలసాహితీ రచయితలను ప్రోత్సహించారు. బాలసాహిత్య కృషి చేస్తున్న రచయితల వివరాలన్నీ సేకరించి, 1995 ప్రాంతంలో వార్త దినపత్రిక ద్వారా వారం వారం పరిచయం చేశారు. ఆ వివరాలన్నీ కలిపి తెలుగు బాలల రచయితల సంఘం 2002లో పుస్తకంగా తీసుకువచ్చింది. రాఘవయ్య బాలసాహిత్యంలో చేసిన కృషికి గుర్తింపుగా వారి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పుస్తకానికి 2003లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ బాల సాహిత్య పురస్కారం ప్రదానం చేసింది. చిరుదివ్వెలు పుస్తకానికి గాను, 2012లో కేంద్ర సాహిత్య అకాడెమీ బాలసాహిత్య పురస్కారం లభించింది. గుంటూరు నన్నపనేని మంగాదేవి అవార్డు, చిలుమూరు, తెనాలి చక్రపాణి - కొలసాని అవార్డు, పార్వతీపురం మంచిపల్లి సత్యవతి జాతీయ అవార్డు వంటి పురస్కారాలూ ఆయనకు లభించాయి.

రాఘవయ్య చాలా పట్టుదల గల మనిషి. ఒక లక్ష్యం మనసులో అనుకున్నారంటే, పూర్తయ్యేదాకా నిదురపోయేవారు కాదు. రాఘవయ్య గారికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాఘవయ్య బాలల గేయాలు, గేయకథలు, పాట కథలు, సైన్స్‌ కథలు, బాలసాహిత్యంపై వ్యాసాలు ఎన్నో పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇప్పటి వరకూ వివిధ ప్రక్రియల్లో రాసిన 32 పుస్తకాలు ప్రచురించారు. మణిదీపాలు అనే పుస్తకం ఆంగ్లంలోకి అనువాదమైంది. ఆయన సంపాదకత్వంలో అనేక బాల సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయి. హైదరాబాదులోని ఆయన ఇంటి పై భాగంలో అపూర్వమైన, అనంతమైన బాల సాహిత్యం కొలువు తీరి ఉంది. ఆ పుస్తక వృక్షాల నీడలోనే ఆయన నిరంతరం సేద తీరేవారు. బాల సాహిత్యాన్ని విస్తృతంగా పిల్లల వద్దకు చేర్చాలన్నది ఆయన తపన. ఆ పనిని కొనసాగించటమే రాఘవయ్య గారికి నివాళి.

- శాంతిమిత్ర