Jul 04,2023 18:39

చెచెన్‌ : రష్యాకు చెందిన నోవాయా గెజిటా వార్తాపత్రికకు చెందిన ప్రముఖ జర్నలిస్టు ఎలెనా మిలాషినా, న్యాయవాది అలెగ్జాండర్‌ నెమోవ్‌లపై మంగళవారం దుండగులు దాడి చేశారు. వీరిద్దరూ స్థానిక విమానాశ్రయం నుండి కారులో చెచెన్‌ రాజధాని గ్రోజ్నీకి ప్రయాణీస్తుండగా ఈ దాడి జరిగింది. రష్యాలోని చెచెన్‌ ప్రాంతంలో ముసుగులు ధరించిన కొందరు ఎలెనా ప్రయాణిస్తున్న కారును బలవంతంగా ఆపి వారిపై దాడి చేశారని, ఈ దాడిలో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారని పాత్రికేయ యజమాని హక్కుల సంఘాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ దాడిలో గాయపడిన మిలాషినా, నెమోవ్‌ ప్రస్తుతం గ్రోజ్నీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ దాడిపై చెచెన్‌ అధికారులు స్పందించలేదు.
కాగా, ఈ దాడి గురించి మానవ హక్కుల సంఘం మెమోరియల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దాడి చేసిన వ్యక్తులు మిలాషినా తలపై ఆకుపచ్చ రంగును పోశారు. ఆమె చేతి వేళ్లను విరిచేశారు. తలపై తుపాకీ పెట్టి చంపేస్తామని బెదిరించారు. కారులో ఉన్న వారి సామాగ్రిని తీసి పగలగొట్టారు. ఇక్కడి నుండి త్వరగా వెళ్లిపో.. ఇక్కడ జరిగిందేదీ రాయవద్దని దుండగులు ఆమెను బెదిరించారు. దుండగులు న్యాయవాది నెమోవ్‌ కాలిని కత్తితో పొడిచారని మెమోరియల్‌ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. అయితే మిలాషినా, నెమోనాలిద్దరూ.. చెచెన్‌లో జరేమా ముసయేవా అనే ఓ మహిళ పోలీసుపై దాడి చేసిందనే అభియోగంపై న్యాయస్థానం విధించిన శిక్షను కవర్‌ చేయడానికే వీరిద్దరూ బయలుదేరని ప్రకటన తెలిపింది. మాస్కోలోని కొంతమంది రష్యన్‌ అధికారులు, చట్టసభ సభ్యులు వీరిపై జరిగిన దాడిని ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తు అవసరమని వారు చెప్పారు.