Feb 18,2023 21:45

ప్రజాశక్తి-నెల్లూరు :ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన పనులన్నింటినీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వదిలేసి కేవలం తనను టార్గెట్‌ చేసి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంపైనే దృష్టిని సాధించారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం నెల్లూరు నగరంలోని రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయంలో తన ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్టు చేసిన విధానాన్ని తప్పుపడుతూ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం స్థానికంగా వైసిపి కార్యకర్తలకు, కొంత మంది టిడిపి కార్యకర్తలకు మధ్య వివాదం చోటు చేసుకుంది వాస్తవమే అన్నారు. అప్పట్లో అది పోలీసు కేసు కాదని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని తాను నిలదీస్తున్న సమయంలో తన పక్షాన నిలిచిన నాయకులను, కార్యకర్తలను భయాందోళనలకు గురిచేయాలని షాడో సజ్జల రామకృష్ణారెడ్డి సూచనల మేరకు ఎస్‌సి,ఎస్‌టి, అట్రాసిటి కేసు పేరుతో విచారణ ప్రారంభించారన్నారు. ఈ కేసులో తన పేరు కూడా చేర్చారని, మొత్తం 11 మంది పేర్లను ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటి కేసులో పొందు పరిచారని తెలిపారు. అరెస్టు చేసిన వారిని పోలీసు స్టేషన్‌కు తరలించకుండా సాయంత్రం 6 నుంచి11 గంటల వరకు పలు పోలీసు స్టేషన్లకు తిప్పుతూ మానసికంగా ఇబ్బందికి గురిచేశారన్నారు. శుక్రవారం రాత్రి తాటి వెంకటేశ్వర్లు, జావేద్‌, మన్నేపల్లి రఘను అరెస్టు చేశారన్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్న కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని తెలిపారు.