ఇంటిలో మగవారిని
యుద్ధానికి పంపుతున్నట్టు
సన్నద్ధం చేసి పంపుతుంది
సముద్రమే దేవుడూ దేవతా ఆమెకు
వట్టిచేతులతో పంపకపోయినా
ఇంటికి తిరిగి చేర్చమని పూజిస్తూనే ఉంటుంది
ఆమెను సముద్రం వినకపోయినా
ఆమెకు సముద్రం వినిపిస్తూనే ఉంటుంది హౌరుమని
ఒడ్దుకి దగ్గరలో బండ మీద కూర్చుని
ఆ బండలా బండబారాలేమో అనుకుంటుంది
అయ్యో ఎందుకని
మాటిమాటికీ ఆ బండని అలలు అడిగిపోతుంటాయి
మీరిలా విసిరేసే ఆల్చిప్పల్లా
మావాడిని మార్చొద్దని
ఒళ్లంతా కళ్లు చేసుకొని ప్రార్ధిస్తుంది
సముద్రం మీద
నమ్మకంతోనే కాదు
అంతకంటే ఎక్కువగా
అపనమ్మకంతో కూడా!
- ముకుంద రామారావు
99083 47273










