Jul 02,2023 15:42

వాషింగ్టన్  :   ట్విటర్‌ వినియోగదారులకు ఎలన్‌ మస్క్‌ షాకిచ్చారు.   ట్వీట్స్‌ను చూడటంలో వినియోగదారులకు పరిమితులు విధించారు. ట్విటర్‌లో పోస్టులను వీక్షించడంపై  తాత్కాలికంగా పరిమితులను ప్రవేశపెట్టినట్లు  శనివారం  ప్రకటించారు. ఖాతాల తీరును బట్టి రోజుకు ఎన్ని పోస్టులు వీక్షించ వచ్చో కూడా ఆయన తెలిపారు. వెరిఫైడ్‌ అకౌంట్‌కు 6వేల పోస్టులు, అన్‌ వెరిఫైడ్‌ అకౌంట్‌కు 600 పోస్టులు, కొత్త అన్‌ వెరిఫైడ్‌ అయిన ఖాతాలు 300 వరకు పోస్టులు చూడవచ్చని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వీటి పరిమితి పెంచుతామని.. వెరిఫైడ్‌కు 8 వేలు, అన్‌వెరిఫైడ్‌కు 800, కొత్త అన్‌వెరిఫైడ్‌కు 400 పోస్టులు రోజులో వీక్షించవచ్చని   వెల్లడించారు.

శనివారం భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. కొందరు ట్వీట్లు ఓపెన్‌ చేస్తుంటే 'కెనాట్‌ రీట్రైవ్‌ ట్వీట్స్‌' 'రేట్‌ లిమిట్‌ ఎక్సీడెడ్‌' వంటి సందేశాలు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై మస్క్‌ పై విధంగా స్పందించారు.   డేటా స్క్రాపింగ్‌, సిస్టమ్‌ మానిప్యులేషన్ల సమస్యలను పరిష్కరించడానికి ఈ తాత్కాలిక పరిమితులను తీసుకొచ్చినట్లు తెలిపారు. వినియోగదారులు ట్విటర్‌కు బానిసయ్యే అవకాశాలెక్కువగా ఉన్నాయని, వాటి నుండి బయటపడాల్సి వుందని అన్నారు. ట్విటర్‌పై పరిమితులు విధించడంతో ప్రపంచానికి మంచి చేస్తున్నానని పేర్కొన్నారు. అయితే ట్విటర్‌పై మస్క్‌ పరిమితులు విధించడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్విటర్‌ పరిమితులపై మాజీ సిఇఒ జాక్‌ డోర్సే స్పందించారు. ట్విటర్‌ను నడపడం కష్టతరమౌతుందని అన్నారు. పరిమితులకు లోబడి ట్విటర్‌ సిబ్బంది తమ వంతు కృషి చేస్తోందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు.