భారత్, అమెరికాల మధ్య గతంలో ఎన్నడూ లేని రీతిలో విశ్వాసం నెలకొందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, వైవిధ్యతపై విలువలను పంచుకోవడం ప్రాతిపదికగా రెండు దేశాల మధ్య సంబంధాలను ఈ పర్యటన మరింత సుస్థిరం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా బయలుదేరి వెళ్లడానికి ముందుగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనడంలో కూడా కలిసి బలంగా నిలబడతామన్నారు.
- ఆరోసారి అమెరికా పర్యటన
ప్రధాని అయిన తర్వాత అమెరికాలో మోడీ పర్యటించడం ఇది ఆరోసారి. ఈ పర్యటనా సమయంలో అమెరికా నాయకత్వాన్ని, కాంగ్రెస్ సభ్యులను, సిఇఓలను, ఇండియన్, అమెరికన్ కమ్యూనిటీని కలుసుకుంటారు. వాణిజ్య, ఇంధన సంబంధాలను పెంపొందించడం, సైన్స్, టెక్నాలజీ, విద్య, ఆరోగ్య రంగాల్లో సహకారంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. జెట్ ఇంజన్లు, డ్రోన్‌ల కోసం ఒప్పందాలతో సహా రక్షణ సంబంధాలపై పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ట్విట్టర్ సిఇఓ ఎలాన్ మస్క్‌తో సహా 24మంది సిఇఓలు, చింతనా మేధావులను మోడీ ఈ పర్యటనలో కలుసుకోనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం యోగా కార్యక్రమంలో పాల్గననున్నారు. వేలాది సంవత్సరాలుగా, భారత సర్వమత సహజీవనానికి ప్రతీకగా వుందని మోడీ పేర్కొన్నారు. వివిధ మత విశ్వాసాలకు చెందిన వారు శాంతియుతంగా సహజీవనం సాగిస్తున్న పరిస్థితి ఈ దేశంలో వుందన్నారు.










