పొద్దున్నే సూర్యుడిని భుజాన వేసుకుని
పొద్దుపోయాక జాబిలిని జోకొట్టి
కర్మాగారాలలో నలుగుతున్న కార్మికుడిని
చూశావా ప్రతి ఉదయం
స్పందించిందా నీ హృదయం?
చలి పులి చర్మాన్ని దేహానికి చుట్టుకుని
గ్రీష్మాన్ని తల పాగాగా పెట్టుకుని
సరి హద్దుల్లో పహారా కాసే సిపాయిని
చూశావా ప్రతి ఉదయం
స్పందించిందా నీ హృదయం?
కరువుని అరువుగా తెచ్చుకుని
రుణాలను మరణ శాసనంగా రాసుకుని
పుడమి నుదటున పచ్చ బొట్టు కోసం
రైతు పడే వెతలను
చూశావా ప్రతి ఉదయం
స్పందించిందా నీ హృదయం?
ఉగ్గు పాలతో ఊపిరి నిలిపి
వసంతాన్నంతా ఊయల చేసి
శిశిరాన్నే మిగుల్చుకున్న వృద్ధ తల్లులను
చూశావా ప్రతి ఉదయం
స్పందించిందా నీ హృదయం?
- కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్ : 7780277240










