పారిస్ : యూరోపియన్ దేశాల పర్యటనలో భాగంగా క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కానెల్ ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్‌తో భేటీ అనంతరం బుధవారం రాత్రి 9.57 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఫ్రాన్స్ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌లో క్యూబా రాయబారి ఒట్టో వైలంట్ ఫ్రియాస్, ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యుఎన్‌ఎస్‌సిఒ)లో క్యూబా ప్రతినిధి యహిమాలు ఆయనకు స్వాగతం పలికారు. క్యూబా అధ్యక్షుడు జూన్ 22, 23 తేదీల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఏర్పాటు చేసిన నూతన గ్లోబల్ ఫైనాన్షియల్ ఒప్పందం సమావేశానికి హాజరుకానున్నట్లు క్యూబా అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. క్యూబాలో సంఘీభావ ఉద్యమంపై స్నేహితులతో మరియు సెర్బియా అధ్యక్షునితో చర్చించామని మిగుల్ డియాజ్ కానెల్ ట్విటర్‌లో పేర్కొన్నారు. సెర్బియాలోని అమర వీరులకు నివాళులు అర్పించామని అన్నారు. సెర్బియా ఉప ప్రధాని, రక్షణ మంత్రి, సెర్బియా సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గన్నారని అన్నారు. అధ్యక్షులు మిగుల్ డియాజ్ కానెల్, అలెగ్జాండర్ వుసిక్‌ల మధ్య చర్చలు ఫలవంతమయ్యాయని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ పేర్కొన్నారు. క్యూబా, సెర్బియాల మధ్య చారిత్రాత్మక స్నేహ సంబంధాలను ధృవీకరించాయని, అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు.










