Aug 15,2022 07:25

నాదేశ స్వా తంత్య్రానికి 75 ఏళ్ళు
గోడకు కొట్టిన సున్నంలా
ప్రజాస్వామ్యం వెలసి పోయింది
ప్రశ్నిస్తే సంకెళ్ళు.. నిర్బంధ శిలువలు

వజ్రోత్సవ వేళ
అవినీతికి అధికారానికి అక్రమ బంధం
దేశభక్తులు.. జైళ్లలో బందీలు
దేశ ద్రోహులు పల్లకిలో షికార్లు
ఇక్కడ ఓటుకు నోటుకు పొత్తు
తాయిలాలిస్తే ఫిరాయింపులు
జారుముడి ఇప్పినంత సులువు

ప్రజాస్వామ్యం పచ్చ నోటై వెలిగే వేళ
స్వాతంత్య్రం.. అంబానీ అదానీల
పెరట్లో లాభాల పూలై పూస్తోంది!
ప్రజా ప్రతినిధులు సంతలో సరుకై
దొరగారి దొడ్లచావిడిలో దొర్లుతూ...
దేశాన్ని ఏలుతున్నారు!

మొలకి తాయెత్తు.. నుదుట విభూది
ఉన్మాదంతో మదమెక్కిన పాలకులు
విషం చిమ్ముతూ చిందులేస్తుంటే
మువ్వన్నెల జెండా ఎగురుతూ
కార్చిన కన్నీరు దరిద్రుని నోట్లో
అమృత్‌ కా ఆజాద్‌ అయింది...
వందేమాతరం ప్రజల నినాదమైంది
ఇంక్విలాబ్‌ దేశమంతా గర్జించింది
అల్లూరి, భగత్సింగ్‌ల అమరత్వం
జాతీయ జెండాలై ఎగిరాయి ...

హిందూ.. ముస్లిం.. బాయీ బారు
నా ప్రజా ఐక్యత పరిఢవిల్లింది
గాంధీజీ మహత్ముడై నడిచాడు
సంపూర్ణ స్వరాజ్య పిలుపునిచ్చిన
ఎర్రజెండా తెల్లోడికి దడ పుట్టించింది

ప్రజల త్యాగాల స్వాతంత్య్రం
స్వర్ణోత్సవ వేళ ఉన్నోడి ఇంట్లో దీపమై
వెలుగుతుంటే... కోట్ల మంది ప్రజలు
చీకటి వాకిట్లో మగ్గిపోతున్నారు ...

ఇప్పుడు నాకు ఆజాద్‌ కావాలి..!
- రెడ్డి శంకరరావు
94943 33511