Oct 21,2022 12:00

సాహిత్య రంగంలో నోబెల్‌ బహుమతి పొందిన మొట్టమొదటి ఫ్రెంచ్‌ మహిళ అన్నీ ఎర్నాక్స్‌. 82 ఏళ్ల వయసులో ఈ అవార్డు ఆమెకు రావడం విశేషమనే చెప్పుకోవాలి. అంతటి విశేషం ఏముందా అని ఆమె జీవితంలోకి తొంగి చూస్తే... ఓ శ్రామిక కుటుంబంలో పుట్టిన అమ్మాయి బాల్యం, యవ్వనం, వైవాహిక జీవితం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు తన రచనల ద్వారా యావత్‌ ప్రపంచానికి తెలియజేసింది. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో మధ్యతరగతి, శ్రామిక మహిళలు పడే కష్టాలకు తన సిరా చుక్కను ఆయుధంగా మార్చింది. ఆమె పుట్టిన దగ్గర నుంచి.. సమాజంలో జరుగుతున్న మార్పులు.. ఆ మార్పుల్లోనూ పురుషాధిక్యతను చాటిచెప్పే ఎన్నో సంఘటనలు ఆమె ఎదుర్కొంది. చారిత్రక రచనలవైపు కాకుండా... ఆమె ఎదుర్కొన్న స్వీయానుభవాలనుంచే రచనలు చేసి.. పురుషాధిక్య సమాజంలో మూగబోయిన మహిళల తరపున తన గళాన్ని వినిపించి నోబెల్‌ని అందుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...


బాల్యం
ఎర్నాక్స్‌ 1940లో ఉత్తర ఫ్రాన్స్‌లో నార్మాండీలోని లిల్‌బోన్‌లో పుట్టి, సమీపంలోని యువెటోట్‌లో పెరిగారు. ఈమె ఒక్కతే కుమార్తె. ఆమె తల్లిదండ్రులు ఓ కేఫ్‌ను, కిరాణాకొట్టును నడిపేవారు. ఎర్నాక్స్‌ చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని వదిలి.. చదువు కోసం ఓ ప్రైవేట్‌ కాథలిక్‌ బాలికల స్కూల్లో చేరారు. తన తల్లి చిన్నతనం నుంచే ప్రసిద్ధ నవలల్ని కొనిచ్చి చదవమని చెప్పేవారు. అలా నవలలు చదవడం వల్ల తనకి రచనలపై ఆసక్తి పెరిగింది. ఆమె కేవలం నవలల్నే కాదు.. ఫ్రెంచ్‌ క్లాసిక్స్‌ అయిన పలు గ్రంథాల్ని కూడా చదివారు. ఇక ఆమె రూయెన్‌ విశ్వవిద్యాలయంలో సాహిత్యాన్ని అభ్యసించారు. ఆమె కొంతకాలం టీచర్‌గా కూడా పనిచేశారు. 1970 నుంచి ఎలాంటి ఉద్యోగమూ చేయకుండా.. పూర్తిగా రచయితగా మారారు. 'హానోర్‌ డి బాల్జాక్‌', 'మార్సెల్‌ ప్రౌస్ట్‌', 'సిమోన్‌ డి బ్యూవోయిర్‌' వంటి ప్రసిద్ధ రచయితల నుంచి ఆమె స్ఫూర్తి పొందారు. ఆమె ఫిలిప్‌ ఎర్నాక్స్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు. అయితే వీరిద్దరూ 1980లో విడాకులు తీసుకున్నారు.

nobel prize 2


రచనలు
చిన్నతనంలో తన తల్లిదండ్రులున్న సామాజిక పరిస్థితుల ఆధారంగా (లా ప్లేస్‌, లా హోంటే) నవలను రాశారు. అలాగే టీనేజ్‌ వయసులో (సీ క్విల్స్‌ డిసెంట్‌ ఓయూ రియెన్‌), ఆమె వివాహం (లా ఫెమ్మె గెలీ), వైవాహిక జీవితం గురించి (పాషన్‌ సింపుల్‌), ఆమె అబార్షన్‌ (ఎల్‌ఈవెన్‌మెంట్‌), ఆమె తల్లి మరణం (యునె ఫెమ్మె), రొమ్ము క్యాన్సర్‌ (ఎల్‌ యుసేజ్‌ డే లా ఫొటో) వంటి రచనలు చేశారు. ఈమె రాసిన 'ఎ ఉమెన్స్‌ స్టోరీ, 'ఎ మ్యాన్‌ ప్లేస్‌' బుక్స్‌ని న్యూయార్క్‌ టైమ్స్‌ నోటబుల్‌ బుక్స్‌గా గుర్తించింది. 'ఏ ఉమెన్‌ స్టోరీ' రచనకు లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ బుక్‌ ప్రైజ్‌కి ఫైనల్‌గా నిలిచింది. 1998లో షేమ్‌ పబ్లిషర్స్‌ 'ఎ ఉమెన్స్‌ స్టోరీ'ని బెస్ట్‌ బుక్‌గా కూడా వెల్లడించింది. అలాగే వాషింగ్టన్‌ పోస్ట్‌లోనూ, ద పొసెషన్‌ బుక్‌ మ్యాగ్‌జైన్‌లో 2008లో టాప్‌ టెన్‌ బుక్స్‌ జాబితాలో ఈమె రచనలు నిలిచాయి.
అలాగే ఆమె రాసిన 'క్లీన్డ్‌ అవుట్‌', 'డూ వాట్‌ దే సే', 'ఎ ఫ్రోజెన్‌ వుమెన'్‌ మొదటి మూడు నవల్లో శ్రామిక, మధ్యతరగతి అమ్మాయిల విద్యాభ్యాసం, వివాహం.. వారి సామాజిక స్థితిగతుల్ని తెలియజేస్తాయి. ఎర్నాక్స్‌ చిన్నప్పటి నుంచే ప్రతి విషయాన్ని నిశితంగా గమనించేది. తండ్రి కేఫ్‌లో పనిచేస్తున్న శ్రామిక మహిళల జీవితాల్ని దగ్గర నుంచి పరిశీలించేది. శ్రామిక మహిళల జీవన విధానం, తన తల్లి మధ్యతరగతి మహిళగా, ఓ గృహిణిగా నిబంధనల్ని విస్మరించడం వంటివి ఆమె రచనలకు మూలం.

books 2


ఆమె రచనలు అందరికీ అర్థమయ్యేలా సాధారణ భాషలో ఉంటాయని, ఆమె చెప్పదలచుకున్నది ఎలాంటి బేషజాలు లేకుండా రాజీపడని ధోరణిలో ఉంటాయని నోబెల్‌ సాహత్య కమిటీ తెలిపింది. ఆమె రచనలే తనకున్న ధైర్యాన్ని తెలియజేస్తున్నాయని నోబెల్‌ సాహిత్య కమిటీ ఛైర్మన్‌ ఆండర్స ఒల్సేన్‌ ప్రశంసించారు. ఫ్రాన్స్‌ సంస్కృతిని, ఆమె ఎదుర్కొన్న అనుభవాల్ని మిళితం చేసి రాసిన 'పబ్లిక్‌ డైరీ' రచన 2019లో అంతర్జాతీయ బుకర్‌ప్రైజ్‌కి ఎంపికైంది.
అన్నీ ఎర్నాక్స్‌ తన జీవితమంతా సాహిత్య సేవలోనే గడిపింది. శ్రామిక మహిళల కష్టాలను, పురుషాధిక్య భావజాలాన్ని, తన జీవితంలోని అనేక మలుపులను కథావస్తువుగా తీసుకోవడం వల్లే ఆమె రచనల్లో సహజత్వం తొంగిచూస్తుంది. 82 ఏళ్ల వయస్సులో నోబెల్‌ బహుమతి అందుకోవడం ద్వారా మరెందరికో ఆమె స్ఫూర్తిగా నిలిచింది.

ernax

 

books 1

 

prize

 

prize 1