మంచు కప్పిన మట్టిలో
గడ్డ కట్టిన నెత్తుటి వాసన
మీకు తెలియదు
ఎగురుతున్న శాంతి కపోతం
రెక్కల బావుటా రెపరెపల ధ్వని
మీకు వినిపించదు
అర్ధరాత్రి విస్ఫారిత ఆకాశంలో
చూపులు పొడిచే కళాకాంతుల భాష
మీకు అర్థం కాదు
అర్ధ నిమీళిత నేత్రాల్లో
తళుకులీనుతున్న కలల్ని
మీరెప్పటికీ చదవలేరు
భయంతో ముడుచుకుంటున్న పువ్వులు
బాధలో రాలిపోతున్న నవ్వులు
మీకు కనిపించవు
పల్చ బడుతున్న జీవితాల్లో
పచ్చిగా కదులుతున్న ప్రాణం
మీరు భరించలేరు
దేశాన్ని యుద్ధరంగంగా మార్చి
స్వేచ్ఛని బహిరంగంగా బలిగొంటూ
చరిత్రను రక్తసిక్తం చేస్తున్నారు
ఉగ్రవాదమా!
మా సహనానికి విరామమిస్తే
మీ సమయమిక అంతమే!
- కుడికాల వంశీధర్
98852 01600










