ఊత కర్రతో నడుస్తున్న
అర్ధనగ్న దేహం - పల్లె!
చిల్లుల జేబు ఆకలి కేకలతో
ప్రతిధ్వనిస్తున్న ధరల దుకాణం - నగరం!
ప్రేవుల నోటికెపుడూ
అందనంత దూరంలోనే ఊరిస్తూ
మార్కెట్ విస్తట్లోని అన్నం ముద్ద!
క్రౌర్యం పాదాలకింద నిగర్వం
నైతిక కట్టుబాటు పేరుతో
ఒక గొర్రెదాటు లొంగుబాటు!
నిరసన స్వరమేదైనా
నియంత్రణ రేఖల మధ్య మాత్రమే
అనుమతించ బడుతుంది!
ఉద్యమ నినాదమేదైనా
మ్యూట్లో ఉన్నంతవరకూ
ఎంత బిగ్గరగానైనా ప్రకటించుకోవడానికి
అభ్యంతరం ఉండకపోవచ్చు -
ధనానికి పొడవాటి చేతులు
అధికారానికి అంతకు మించి!
అత్యాశ వ్యామోహం
పది పది రెట్లు లాభాలుగా
రెక్కలు విప్పుకుని ఎగిరినపుడు
కులం చక్రాలు నడిపించే కుర్చీబండి
మార్మిక వృక్షంగా మారి
ఎన్నెన్ని కురూపాల కొమ్మలుగా విస్తరిస్తుందో..!
ఆకాశంలోకి వేర్లు పాకి
నేల అడుగున కొమ్మలు పెరిగే
మైటీ ట్రీ మేజిక్ ఎవరికీ కనబడదు
ఎందుకంటే దాని విస్తరణా వ్యాప్తి
అంతా మెదడు ఎడారిలోనే!
- కంచరాన భుజంగరావు
94415 89602










