Aug 15,2022 07:30

రెక్కలు తెగనరికి పావురాన్ని ఎగరేస్తే
రంగులన్నీ నిషేధించి
రంగు రంగుల ప్రపంచాన్ని చూడమంటే
గొంతుకలను నిషేధించి
స్వేచ్ఛా గీతాలు పాడమంటే
అక్షరాలకు ఆంక్షలు పెట్టి
వీరోచిత గాధలు రాయమంటే
సచ్‌ మే ఏ ఆజాదీ హై?
కత్తులు పంచి
కలసి మెలసి ఉండమంటే
విషం విత్తులు నాటి
స్వతంత్ర సంబరాలు జరుపుకోమంటే
క్యా ఏ సచ్‌ మే ఆజాదీ హై?

వందల మైళ్ళు నడిచి వెళ్లిన
వలస కూలీల మీద విరిగిన లాఠీల సాక్షిగా
దీపాలు ఆర్పేసి దండాలు పెట్టించి
చప్పట్లు కొట్టమని చేతులు దులుపుకున్న దివాళాకోరుతనం సాక్షిగా ...

వైద్యం అందక ఊపిరందక..
ప్రాణాలొదిలిన దేశంలో
పీనుగులకు సమాధానం చెప్పకుండానే ...
ప్రపంచ కుబేరులున్న దేశంలో
పేదవాడి ఆకలి చావులు
ఎవరికి స్వాతంత్య్ర ఫలాలను అందించాయో
నోట్ల రద్దు, నయా పన్నువిధానాలు
మధ్య తరగతి వెన్ను విరిచాయో
మాట్లాడకుండానే..
ఆజాదీ కా అమృత్‌ మహౌత్సవాలు జరుపుకుందామా?
క్యా ఏ సచ్‌ మే ఆజాదీ హై..?
- నబీ కరీం ఖాన్‌
99859 82292