Aug 15,2022 07:30

అగంతకులెవ్వరో
తూనీగ రెక్కల్ని కత్తిరించు కుంటూ పోతున్నారు
రాలే పూల రాగాల్ని కాలం బుట్టలో వేసి
కాపలా కాస్తున్నాను నేను

ఒకానొక పరగడుపు ఉదయానికి
భానుడు రాసిన ప్రేమలేఖలో
రుతువుల్ని బంధించడం నేరమని
పిట్ట కథలూ, పేదరాసి పెద్దమ్మ కథలూ
ప్రకృతికి హాని చెయ్యవనీ ఉంది
గత కాలపు పోరాట గాధలెప్పడూ
స్ఫూర్తినిచ్చివిగానే ఉంటాయి!

చీమల పుట్టలో పాములు చేరినట్టు
ప్రపంచపటమంతా శ్రమ దోపిడీ
నెత్తులకు కట్టిన బండరాళ్లను
లాక్కెళ్ళుతూ ప్రజలు!
నా దేశంలో కూడా ఇదే దృశ్యం
పున: పున: పునరావృతం

పచ్చదనం ఉసురు తీసినందుకేమో
రోడ్లంత విశాలంగా ఉన్నాయి
పగలు రాత్రీ పందెం వేసుకున్నట్లు
గడియారంలో ముళ్ళను
ఎవరో వేలు పెట్టి తిప్పినట్లు
టిక్‌ టిక్‌ శబ్దాలతో రోజుల దారుణ హత్య
కార్పొరేట్‌ పట్టు పరుపుల దొంతరల్లో
ఆయురారోగ్యాల ఖననం!

నా నేల నేలంతా
జిఎస్టీ దేవతా వస్త్రాలు కప్పుకుని
ధగధగా మెరిసిపోతోంది
తాను తినే నాలుగు మెతుకులకు
ఆ కూలీ కుటుంబం సుంకం కట్టకపోతే
కుబేరుల కబేళాలు నిండుకుంటాయట!

నిండుకుండలాంటి ధాన్యాగారాలు
పాలరాతి గాదెల్లో అవినీతి మందు తాగి
మత్తు నిద్ర పోతున్నాయి
ఎవరెవరి రక్తాన్నో పిండుకుని బలపడిన డాలర్లు
బార్బీ బొమ్మలుగా
కోట గుమ్మాల్ని ముస్తాబు చేస్తున్నాయి

రాత్రి నిద్ర పట్టక
వాళ్ళ ప్రహరీ దూకి
ఇంటి వెనుక తోటలో
మట్టిని తవ్వి చూశాను
శ్రామికుల రక్తంతో కట్టిన భవంతులు
ఆకాశానికి ఎగబాకి ఉన్నాయి
బయట భ్రమల గంతలు కట్టుకుని
ఆకాశాన్నే చూస్తున్నారు అందరూ
కాళ్ళ కింద నేల
కనుచూపు మేర కనబడకుండా
కదిలెళ్ళిపోతోంది!

ఇప్పుడు నువ్వూ నేను
రెక్కలు కత్తిరించిన తూనీగలం
వాక్స్వాతంత్య్రం లేని దేశంలో
వాట్సాప్‌ డీపీలుగా మిగిలిపోయి!
- వైష్ణవి శ్రీ
80742 10263