Apr 02,2023 20:19

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజలు అండగా ఉన్నారని, అలాంటి ముఖ్యమంత్రి కోసం అందరం వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేద్దామని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని శ్రీధర్‌ గార్డెన్స్‌లో ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, సచివాలయ కో ఆర్డినేటర్లు, కన్వీనర్లతో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలంతా పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కొన్ని మీడియా ఛానెళ్ల, సోషల్‌ మీడియా వాళ్లు ప్రజలను అనేక ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాటిని తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
తమ కుటుంబం కూడా పార్టీ మారుతుందని ప్రచారాలు చేశారని, తమ కుటుంబమంతా ఎప్పుడూ జగనన్నతోనే ఉంటామని తెలియజేశారు. జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో సైతం రెండవ ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారని, మనం ఒక్కరమే పోటి చేస్తే వాళ్లందరూ కలసి మన మీద పోటీ చేసి గెలిచారన్నారు. రానున్న కాలంలో ప్రజలందరినీ మరింత ప్రలోభాలకు గురిచేసే అవకాశముందని, కానీ మనమంతా సమిష్టిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇలాంటి ముఖ్యమంత్రి మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేయాల్నిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఓ వైపు సంక్షేమ పాలన అందిస్తూనే మరో వైపు అభివృద్ధిని సైతం పరుగులు తీయిస్తున్నారన్నారు. పోర్టుల నిర్మాణాలు పూర్తయితే పారిశ్రామికంగా రాష్ట్రం ముఖ్యంగా మన జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మనమంతా సమిష్టిగా కలిసి పనిచేస్తే ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
11న రెవెన్యూ సమస్యల ప్రత్యేక సమీక్ష :
ఆత్మకూరు నియోజకవర్గంలో నెలకొని ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం 11వ తేదీన రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో భూపంపిణీ, చుక్కల భూములు, సాధా బైనామా, పాసుపుస్తకాల మంజూరు, ఈనాం భూములు తదితర సమస్యలను మండలానికి ఓ గంట సమయం కేటాయిస్తూ నెల్లూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌డిఒలతో కలసి ప్రత్యేక సమీక్ష నిర్వహించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల తమ గ్రామాల్లో, పంచాయతీల్లో మండలాల్లో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే వాటిని 11వ తేదీ జరిగే సమీక్షలో చర్చించి పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, మాజీ జెడ్పిటిసి డాక్టర్‌ సిహెచ్‌ ఆదిశేషయ్య, ఎఎస్‌పేట జెడ్‌పిటిసి సభ్యులు పందులపల్లి రాజేశ్వరమ్మ, అనంతసాగరం ఎంపిపి పెయ్యల సంపూర్ణమ్మ, మండల కన్వీనర్‌ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, సంగం, చేజర్ల మండల కన్వీనర్లు పాల్గొన్నారు.