Apr 02,2023 20:25

ఫొటో : ఎంపి ఆదాలకు వినతిపత్రం అందజేస్తున్న గొల్లకందుకూరు గ్రామస్తులు

15 రోజుల్లో సమస్యకు పరిష్కారం
ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు రూరల్‌ పరిధిలోని గొల్లకందుకూరు గ్రామంలోని పట్టాలకు నోచుకోని శివాయి భూములకు 15 రోజుల్లో ఆర్‌డిఒ తహశీల్దారులతో సమావేశమై పరిష్కార మార్గం చూపుతామని నెల్లూరు ఎంపి, రూరల్‌ వైసిపి ఇన్‌ఛార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి హామీనిచ్చారు. ఆదివారం గొల్లకందుకూరు గ్రామస్తులు నెల్లూరులోని ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఆఫీసుకు వెళ్లి వినతిపత్రం అందజేశారు. కరెంటు సమస్యకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని ఎంపి ఆదాలకు వివరించారు. జామాయిల్‌ చెట్లలో ప్రస్తుతం కరెంటు లైన్‌ వెళుతుందని తద్వారా కరెంటు రావడం సమస్యగా మారుతుందని వివరించారు. అక్కడ నుంచి విద్యుత్‌ లైను మారిస్తే సమస్యకు పరిష్కారం ఉంటుందని ప్రజలు ఎంపి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులతో ఫోన్‌ ద్వారా సంభాషించి, వెంటనే అక్కడినుండి విద్యుత్‌ లైన్‌ మార్చి ప్రజలకు కరెంటు కష్టాలు తీరేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా గొల్లకందుకూరు గ్రామంలో కల్వర్టు, రోడ్లు, డ్రెయినేజీ పనులకు వెంటనే అంచనాలు తయారుచేసి పనులు మొదలుపెట్టి పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అధికారులకు సూచించారు. తక్షణమే గ్రామంలో పూర్తి చేయడానికి వీలుండే పనులను ఏమాత్రం ఆలస్యం జరగకుండా పూర్తి చేస్తామని ప్రజలకు హామీనిచ్చారు. అభివృద్ధి విషయంలో వెనకందు వేసే ప్రసక్తే లేదని, గ్రామాలకు ఏయే అభివృద్ధి పనులు కావాలో..? అంచనాలతో జాబితా తయారు చేయాలని గ్రామస్తులకు సూచించారు. అనంతరం గ్రామస్తులు నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డితో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఎంపిటిసి సుధాకర్‌ రెడ్డి, వైసిపి నాయకులు తాటిపర్తి వెంకటేశ్వర్లు, గోపాలయ్య, బాబురావు, మహేంద్ర, రాజేష్‌, అయ్యప్ప, వెంకటసుబ్బయ్య, బి.వేమయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.