ప్రజాశక్తి-చందర్లపాడు: స్థానిక సిఐటియు కార్యాలయంలో సిఐటియు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎ.కమల మాట్లాడుతూ రాష్ట్రంలో కనీస వేతనాల సలహా బోర్డును ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, అన్ స్కిల్డ్ కార్మికుడికి నెలకు రూ.26 వేలు కనీస వేతనం నిర్ణయించాలని, ఇతర గ్రేడ్‌లకు ఆ పైన వేతనాలు అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనాలు, గ్రాడ్యుటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని తదితర అంశాలపై 13న విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు, చందర్లపాడు ఆశా వర్కర్లు రాణి, మేరి, సువర్ణ, చందర్లపాడు మధ్యాహ్న భోజన కార్మికుల మండల అధ్యక్షులు ఎస్.కె మౌలాలి, జెర్రిపోతు లక్ష్మయ్య, దున్న జోజిబాబు తదితరులు పాల్గొన్నారు.










