ప్రజాశక్తి-సోమందేపల్లి : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఇన్‌ఛార్జిల పాలన, తగినంత సిబ్బంది లేక పాలన అస్తవ్యస్తంగా తయారైందని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్, ఇద్దరు ఆర్‌ఐలు, ఐదుగురు వీఆర్వోలు ,ఒక సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండలంలో కొన్ని గ్రామాల్లో రీ సర్వే పనులు జరుగుతున్నాయి అదేవిధంగా నాసన్, బెల్ ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూమి కి సంబంధించిన రైతులు పరిహారం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనిమిదో విడత భూ పంపిణీ సాగుదారులకు పట్టాలు కేటాయించడంలో తగినంత సిబ్బంది లేకపోవడంతో సాగుదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తహశీల్దార్ పలు ప్రభుత్వ పనుల నిమిత్తం కార్యాలయానికి రాకపోతే కుల, ఆదాయ ధ్రువీకరణ తదితర పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.ఉన్న వీఆర్వోలను పలు గ్రామాలకు ఇన్‌ఛార్జులుగా నియమించడంతో వారు తమకు కేటాయించిన గ్రామాలకు, ఇన్చార్జి గ్రామాలకు ఇటు కార్యాలయానికి తిరగటంతోనే సమయం వృథా అవుతోంది. పూర్తి సమయాన్ని పరిపాలన కేటాయించలేక పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. జిల్లా అధికారులు సోమందేపల్లి తహశీల్దార్ కార్యాలయంపై దృష్టి సారించి తగినంత సిబ్బందిని కేటాయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.










