ప్రజాశక్తి -కందుకూరు : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, లోకేష్‌ని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం హైదరాబాద్‌లో మర్యా దపూర్వకంగా కలిశారు. ఇటీవల కందుకూరులో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాట, పోలీసుల వైఫల్యాన్ని లోకేష్‌కి వివరించారు. సుమారు 40 వేల మంది తరలివస్తారని ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ, సరైన బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందని తెలిపారు. ఊహించినట్టుగానే, జగన్మోహన్ రెడ్డి చేతకాని పరిపాలనతో ఇబ్బందులు పడుతున్న వారంతా వేల సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడంతోనే అనుకోకుండా ప్రమాదం జరిగిందన్నారు. తొక్కిసలాటలో 8 మంది కార్యకర్తలు చనిపోగా నారా చంద్రబాబు నాయుడు వారందరి ఇళ్లకు స్వయంగా వెళ్లి నివాళులర్పించడం, కుటుంబ సభ్యులను ఓదార్చడంతోపాటు ఆర్థిక సహాయం అందించడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. ఆపదలో ఉన్న కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడుకి, పార్టీ నాయకులకు కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని నాగేశ్వరరావు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారందరినీ స్వయంగా పరామర్శించి ఆర్థిక సహాయాలు అందజేసినట్లు నాగేశ్వరరావు తెలిపారు. దుర్ఘటనపై వైసిపి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులకు భయపడవద్దని, న్యాయపరంగా ముందుకు వెళ్లి ప్రభుత్వాన్ని కోర్టులో దోషిగా నిలబెడదామని లోకేష్ ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, కార్యక్రమాల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్న లోకేష్ సమర్థవంతంగా పనిచేస్తున్నారంటూ నాగేశ్వరరావుని అభినందించారు. వచ్చే ఎన్నికల్లో కందుకూరులో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లాలని సూచించారు. త్వరలో యువగళం పేరుతో జరగనున్న లోకేష్ పాదయాత్ర పైనా చర్చించారు. లింగసముద్రం మండలం యర్రారెడ్డిపాలెం గ్రామ పార్టీ నాయకుడు రాజవరపు మాలకొండయ్య కూడా నాగేశ్వరరావు వెంట ఉన్నారు.










