మడకశిర : ఇంటర్ షిప్ పేరుతో డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నుండి అనధికారంగా వసూళ్ల పర్వానికి తెరలేపాలని ఇది వెంటనే ఆపాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ ఆనంద్ కుమార్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ 2020 సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంలో భాగంగా డిగ్రీ విద్యార్థులు 5 లేదా 6 సెమిస్టర్‌లో ఆరు నెలలు పాటు ఇంటర్నేషిప్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులు చదువుతున్న కోర్సులకు సంబంధించి వివిధ పరిశ్రమలలో కొన్ని నెలల పాటు తర్ఫీదు పొందిన అనంతరం ఆ కంపెనీ వారు ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని విద్యార్థులు పొందాల్సిఉంటుందన్నారు. ఈ ఇంటర్న్ షిప్ లో పరిశ్రమల వారు విద్యార్థుల కు కొంత పొత్రాహకంగా ఫెలోషిప్ పేరుతో నగదును చెల్లిస్తార చెప్పారు. ఈ ఇంటర్నెట్ షిప్ భవిష్యత్తులో డిగ్రీ అనంతరం వారి జీవనోపాధి కోసం ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల సంక్షేమ దృష్ట్యా ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెడితే కొన్ని డిగ్రీ కళాశాలలు విద్యార్థుల నుండి వేలాది రూపాయలు వసూలు చేసుకుని పరిశ్రమలో తర్ఫీదు పొందినట్లుగా ధ్రువీకరణ పత్రం ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారని ఆరోపించారు. ఈ విధానం కళాశాలల వారు మానుకొనేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, హేమంత్, సురేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










