Oct 17,2022 23:29

  • నిధుల కొరతతో అరకొరగానే నిర్వహణ
  • స్వచ్ఛమైన నీరు మాటల్లోనే...
  • ప్రతిపాదన దశలోనే మల్టీవిలేజ్‌ స్కీంలు

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి
గ్రామీణ ప్రాంతాల్లో కాలంచెల్లిన పైప్‌లైన్‌లు తరచూ లీకవుతున్నాయి. లీకుల్లో నుంచి చేరిన మురుగు నీరు కుళాయి నీటిలో కలిసిపోతోంది. మరికొన్ని గ్రామాల్లో ఆక్వా చెరువుల నుంచి వదిలిన మురుగునీరు తాగునీటి చెరువుల్లో కలుస్తోంది. తాగునీటి కాలుష్యం కారణంగానే ఈ ఏడాది వేసవి, వర్షాకాలంలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. తెంపల్లి, పామర్రు, బల్లిపర్రు తదితర గ్రామాల్లో పలువురు ఇటీవల కలరా, అతిసార బారిన పడ్డారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటికీ కుళాయి పథకంలో ఈ సమస్యలు పరిష్కారమై పరిశుభ్రమైన తాగునీరు అందుతుందని ఆశిస్తున్న వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి. జలజీవన్‌ మిషన్‌ పధకం కింద కృష్ణాజిల్లాలో జరుగుతున్న పనులను, మల్టీపర్పస్‌ విలేజ్‌ స్కీం ప్రతిపాదనలు పరిశీలిస్తే ఈ విషయం తెటతెల్లం అవుతుంది. ఈనేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికిి పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందో రాదో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.
ఇంటింటికీ కుళాయి పథకం ప్రాజెక్టును గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. గృహాలతోపాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేవిధంగా అధిక మొత్తంలో నీటి సరఫరాకు వేల కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించింది. అయితే ఆర్థికంగా భారం అవుతుందన్న ఉద్దేశంతో దీన్ని పక్కన పెట్టింది. జిల్లాలో 618 పనులను రూ.159.07 కోట్లతో నిర్వహించడానికి టెండర్లు ఖరారు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిధుల విడుదలపై ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రూ.5 లక్షలలోపు విలువగలిగిన పనులను మాత్రమే కాంట్రాక్టర్లు చేపట్టారు. దీంతో రూ.4 కోట్ల విలువైన 96 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 238 పనులు పురోగతిలో ఉన్నాయి. 218 పనులు ఇంకా టెండరు దశ దాటలేదు. జిల్లాలోని 501 రెవెన్యూ, 1263 శివారు గ్రామాల్లో మొత్తం 3,84,128 గృహాలున్నాయి. 2,09,850 గృహాలకు కుళాయి కనెక్షన్లున్నాయి. మరో 1,74,278 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది.
రూ. 750 కోట్లతో మల్లీ విలేజ్‌ స్కీం ప్రతిపాదన
గుడివాడ, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అధిక విస్తీర్ణంలో రొయ్యలు, చేపల చెరువులున్నాయి. ఆక్వా జలాలు పంట కాల్వల్లో చేరడంతోపాటు పరిసర గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో చేరుతున్నాయి. దీంతో తాగునీరు కలుషితమవుతోంది. దీంతో గ్రామాల్లో పేదలు కూడా మినరల్‌ వాటర్‌ క్యాన్లు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఒక చోట తాగునీటి చెరువును ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నీటిని అందించేందుకు (మల్టీ విలేజ్‌ వాటర్‌ స్కీం) ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.750 కోట్లతో జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవడంతో ఇంకా టెండరు దశకు కూడా చేరలేదు.