Jul 12,2022 23:32

  • బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో 42 వేల క్యూసెక్కులు
  • అవుట్‌ఫ్లో 37 వేల క్యూసెక్కులు
  • కాల్వలకు 5 వేల క్యూసెక్కులు విడుదల
  • నిలకడగా మునేరు ఉధృతి
  • పొంగిప్రవహిస్తున్న వైరా ఏరు, కట్టలేరు

ప్రజాశక్తి-విజయవాడ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలువాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజికి కూడా వరద ప్రవాహనం కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి 42 వేల క్యూసెక్కుల వరద నీరు ఎగువ ప్రాంతం నుంచి బ్యారేజికి వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజి 50 గేట్లను ఒక అడుగు ఎత్తి 37 వేల క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో ఐదు వేల క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నట్లు బ్యారేజి ఇఇ పివిఆర్‌ కృష్ణ తెలిపారు. ఈ ప్రవాహం ప్రస్తుతం యధావిధిగా కొనసాగుతోందని వివరించారు. బ్యారేజి నీటి మట్టం ప్రస్తుతం 12 అడుగులుగా ఉంది.
కీసర బ్రిడ్జి వద్ద 35 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం
కంచికచర్ల : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మునేరుకు భారీగా వరద నీరు చేరింది. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వైరా ఏరు, కట్టలేరు, మునేరుకు వరద నీరు చేరింది. గత నాలుగు రోజులుగా మునేరుకు వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం కీసర బ్రిడ్జి వద్ద 35 వేల క్యూసెక్కుల వరదనీరు దిగువకు ప్రవహిస్తున్నట్లు సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మునేరుకు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మునేరు నుంచి వరద కంచికచర్ల మండలం మోగులూరు సమీపంలో కృష్ణానదిలోకి చేరుతోంది. ఈ ఏడాది మునేరుకు తొలకరి వానలతోనే వరద రావటంతో తీర గ్రామాల్లో రైతులు మాగాణి, మెట్ట పంటలకు ఢోకా ఉండదని అంటున్నారు. కృష్ణానదికి కూడా వరద రావటంతో తీర గ్రామాల రైతాంగం మాగాణి పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. మునేరుతోపాటు కృష్ణానదికి వరద రావటంతో తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ నదిలోకి దిగవద్దని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నందిగామ : తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వైరా ఏరు, కట్టలేరు పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు ఏరులు కలిసే దాములూరులోని కూడలి సంగమ వద్ద వరదనీరు బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీరులపాడుకు చెందిన 15 గ్రామాల ప్రజలు నందిగామ రావాలంటే ఈ బ్రిడ్జి ఆధారంగా ఉంది. వర్షాకాలంలో తరచూ వచ్చే వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో దీనికి ప్రత్యామ్నాయంగా ఓ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనైనా పూర్తవుతుందన్న ఆశలో ప్రజలు ఉన్నారు. ఇది పూర్తయితే 40 నుండి 50 కిలోమీటర్లు తిరిగి వచ్చే పని ఉండదు. వత్సవాయి : లింగాల కాజ్వే వద్ద వరద నీరు మంగళవారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. తెలంగాణా రాష్ట్ర వరంగల్‌ జిల్లా పాకాల చెరువు నుంచి వస్తున్న వరద నీరు ఖమ్మం జిల్లా మీదుగా ప్రవహించడంతో వత్సవాయి మండలం పోలంపల్లి రాజీవ్‌ మునేరు చెక్‌ డాం నిండిపోయింది. చెక్‌ డ్యాం వద్ద 15 అడుగుల మేర నీరు చేరింది. దిగువకు వచ్చే వరద నీరు లింగాల బ్రిడ్జికి దిగువగా ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థితిలోనే వాహనాలు రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ వరద ఉధతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు నీటితో జలకళ లాడుతున్నాయి. మునేరు ఆయకట్టు కింద ఉన్న రైతులు నారు మడులకు సన్నద్ధమవుతున్నారు. లింగాల, చిల్లకల్లు పైలెట్‌ ప్రాజెక్టుకు కూడా వరద నీరు చేరింది.