ప్రజాశక్తి-పీలేరు: ఇందన పొదుపు మనందరి బాధ్యతని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయ నుండి విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులుతో కలిసి పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం వేశారు. ఇంధన పొదుపుపై పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీలేరు సబ్ డివిజన్ విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్) ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ 2001 నుంచి జ్రలకు, వినియోగదారులకు ఇంధన పొదుపు ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం జరుగుతోందని అన్నారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబరు 14 నుండి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నేలలోంచి బొగ్గు అంతరించిపోతుందని, ఆయిల్ నిల్వలు తరిగిపోతున్నాయన్నారు. ప్రస్తుతం మనం ఇంధన పొదుపును అనుసరించకుంటే భావితరాల భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. విద్యుత్ పొదుపు గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి కోటపల్లి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తత్వ పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇంధనాన్ని వధా చేస్తే పర్యావరణం కలుషితమవుతుందని పేర్కొన్నారు. సోలార్ వినియోగంపై ప్రత్యేక దష్టి కేంద్రీకరించాలని ప్రజలను కోరారు. విద్యుత్ పొదుపు చేయడమంటే విద్యుత్ ఉత్పత్తి చేసినట్లేనని చెప్పారు. కార్యక్రమంలో ఏపిఎస్‌పిడిసిఎల్ పట్టణ అసిస్టెంట్ ఇంజినీరు టి.వెంకటపురుషోత్తం, గ్రామీణ సహాయ ఇంజనీరు రామ్మూర్తి, ఫోర్ మ్యాన్ జి.శ్రీనివాస కుమార్, లైన్ ఇన్‌స్పెక్టర్ కె.రవికుమార్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ డి.లాజర్, విద్యుత్ శాఖ సిబ్బంది, కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు.










