Sep 30,2022 22:14

ప్రజాశక్తి - వన్‌టౌన్‌
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ ఐదవ రోజైన శుక్రవారం శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం కావటంతో దుర్గమ్మను దర్శించుకోవాలనే కాంక్షతో ఉదయం నుండే పిల్లలతో సహా కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి దుర్గమ్మను శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకారాన్ని దర్శించుకునేందుకు తండోప తండాలుగా తరలివచ్చారు. దీంతో ఉచిత దర్శనాలతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500ల క్యూ లైన్లలో కూడా భక్తులతో కిటకిటలాడాయి. కెనాల్‌ రోడ్డులోని వినాయకుని గుడి వద్ద నుండి ప్రారంభమైన మూడు క్యూలైన్లతో పాటు విఐపీల కోసం ఇంద్రకీలాద్రిపై ఏర్పాటుచేసిన రూ. 500ల క్యూ లైన్‌ కూడా భక్తులతో నిండిపోయింది. దేవస్థానం నిర్వాహకులు, అధికారుల అంచనాలు మించి దుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం వస్తున్న సందర్శకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో క్యూ లైనులో అమ్మవారి దర్శనం కోసం వచ్చిన యాత్రికులకు అందరికీ దేవస్థానం అధికారులు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిని దర్శించుకునేందుకు సుమారు లక్ష పైగానే భక్తులు, యాత్రికులు దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కావటంతో రానున్న రెండు రోజులు దుర్గమ్మ దర్శనానికి భారీ సంఖ్యలో తరలివస్తారని, ఆదివారం మూలా నక్షతం, దుర్గమ్మ శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. దీంతో ఆ రోజు ఎక్కువమంది విద్యార్థినీ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దీనికోసం అన్ని శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తుల ఏర్పాట్లపై
మంత్రి కొట్టు సత్యనారాయణ నిరంతర పర్యవేక్షణ
శరన్నవరాత్రి దసరా ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఐదవ రోజు కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరిదేవి అంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ క్యూ లైనులో వున్న భక్తులను పలుకరిస్తూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు క్యూలైన్‌ ఏర్పాట్లు, వద్ధులకు, పిల్లలకు దేవస్థానం అందిస్తున్న సేవలు మరియు వృద్ధుల కోసం వాలంటీర్ల ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దాతలు అందించిన ఉచిత వాహన సేవల గురించి భక్తులు సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, సకల జీవకోటి సుఖసంతోషాలతోను, అన్న పానీయాలతో కలిమిలేములతో జీవనమయం కొనసాగించాలని అమ్మవారిని మనసారా ప్రార్థించినట్లు తెలిపారు.