ప్రజాశక్తి-వన్‌టౌన్: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అయితే రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన భవానీలు శుక్రవారం కూడా ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో రద్దీ కొనసాగింది. భవానీల దర్శనం కోసం దుర్గగుడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విఐపి రూ.500 టిక్కెట్ తప్పించి రూ.300, రూ.100 టిక్కెట్ క్యూలైన్లలో కూడా భవానీలకు ఉచిత దర్శనం కల్పించారు. దీంతో భవానీలు, వారితో వచ్చిన కుటుంబ సభ్యులకు దుర్గమ్మ దర్శనం సుగమమైంది. కనకదుర్గా నగర్‌లో దసరా ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన లడ్డూ స్రసాద కౌంటర్లు యధావిధిగా పనిచ ేస్తున్నాయి. దుర్గమ్మ దర్శనం ముగించుకుని మెట్ల మార్గం గుండా కనకదుర్గా నగర్‌కు చేరుకున్న భవానీలకు కేశఖండన శాల ఎక్కడుందో తెలియక అవస్థలు పడుతున్నారు. ఎక్కడా కూడా భవానీలకు తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయకపోవటంతో వారు ఇబ్బందులకు గురయ్యారు. భవానీల రాకతో వన్‌టౌన్, వినాయకుని గుడి ప్రాంతం, విఎంసి కార్యాలయం, బ్రాహ్మణ వీధులు రద్దీగా కనిపించాయి. భవానీపురం నుంచి వెళ్లు ద్విచక్ర వాహనదారులను కూడా దుర్గగుడి నుండి బ్రాహ్మణ వీధి మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
స్తంభించిన ట్రాఫిక్
ప్రజాశక్తి-విజయవాడ: ప్లైఓవర్- బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాల రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడింది. భవానీ భక్తుల రాక సందర్భంగా కృష్ణలంక ప్రధాన రహదారిపై అడుగడుగునా ట్రాఫిక్ స్తంభించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉతరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున భవానీలు దుర్గగుడికి తరలిరావడంతో రహదారి భవానీలతో కిక్కిరిసిపోయింది. దుర్గగుడి దిగువ పరిసర ప్రాంతాలతో పాటు ప్రధానంగా పిఎన్ బస్‌స్టేషన్ ఎదురు మెయిన్ రహదారి, రైల్వే అండర్ బ్రిడ్జీ, రాజీవ్‌గాంధీపార్కు, ప్లైఓవర్ దిగువన తదితర ఏరియాల్లో భవానీల రాకపోకలతో రద్దీ పెరగడంతో రాకపోకలకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీలు, ట్రావెల్స్, జీపులు, వ్యాన్స్ తదితర వాహనాల్లో భవానీలు రావడంతో ఆ వాహనాల పార్కింగ్‌కు స్థలం లేక ప్లైఓవర్‌పైన, కృష్ణలంక రహదారి పక్కన పార్కింగ్ చేసుకోవాల్సి వచ్చింది. దీని వల్ల రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. పెరిగిన భవానీల, వాహనాల రద్దీని నియంత్రణ చేయడంలో ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులకు తలకుమించిన భారంగా తయారైంది.










