రాయచోటి : ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాలని అధికారులను కలెక్టర్ గిరీష పిఎస్ ఆదేశించారు. ఆదివారం రాయచోటి అర్బన్ పరిధిలోని నారాయణరెడ్డిపల్లి జగనన్న కాలనీ లేఅవుట్‌లో నిర్వహిస్తున్న ఇళ్ల నిర్మాణాలను ఆదివారం కలెక్టర్ స్వయంగా ద్విచక్ర వాహనంపై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా నారాయణరెడ్డిపల్లి జగనన్న కాలనీ లేఔట్‌లో నిల్వ ఉంచిన సిమెంట్ గోదాం, ఇతర సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. ఎన్ని బస్తాల సిమెంట్ నిల్వ ఉంది,ఇంకా ఎంత ఇండెంట్ పెట్టారు, వంటి వివరాలను హౌసింగ్ పీడీని అడిగి తెలుసుకున్నారు. నారాయణరెడ్డిపల్లి జగనన్న కాలనీ లేఔట్‌లో 6420 ఇళ్ల నిర్మాణంలో బిబిఎల్ దశలో 1864 ఇళ్లు, బిఎల్ 3175, ఆర్ ఎల్ 260, ఆర్ సి 473, ఇంకా మిగిలిన దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక వస్తుందా లేదా అడిగి తెలుసుకున్నారు. బిల్లుల మంజూరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఇంజనీర్ అసిస్టెంట్లను కలెక్టర్ హెచ్చరించారు. ఆర్‌ఎల్ స్టేజీలో ఉన్న ఇళ్లన్నీ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫైనల్ స్టేజ్‌లో 150 ఉన్నాయని, వాటి పూర్తి కోసం మెప్మా అధికారులు లబ్ధిదారులకు రుణం ఇప్పించాలన్నారు. ప్రతి శనివారమూ లేవుట్ విజిట్ చేస్తానని, పురోగతి కనిపించకపోతే మాత్రం వేటు తప్పదని ఇంజినీర్‌్ అసిస్టెంట్లను కలెక్టర్ హెచ్చరించారు. అందులో భాగంగా కలెక్టర్ ద్విచక్ర వాహనంలో ఇళ్ల నిర్మాణాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాంబాబు, హౌసింగ్ పీడీ శివయ్య, ఇతర శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










