రాయచోటి: జగనన్న హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ గిరిష సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో స్పందన అర్జీలు, రీ సర్వే, హౌసింగ్, గ్రామ వార్డు సచివాలయాల సమస్యలు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతోసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న హౌసింగ్ ఇల్ల నిర్మాణాలు నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సొంత స్థలాలలో ఇళ్లు నిర్మించుకునే హౌసింగ్ లబ్ధిదారులకు వెంటనే పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని తహశీల్దార్లకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయరాదని వారికి సూచించారు. అధికారులు స్పందన అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతప్తి చెందేలా నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితులలో అర్జీలు బియాండ్ ఎస్‌ఎల్‌ఎ, లోకి వెళ్లకుండా గడువులోగా అర్జీలను పరిష్కరించాలన్నారు. స్పందన అర్జీలకు సరైన విధంగా ఎండార్స్మెంట్ చేయాలని, అర్జిదారునికి కూడా అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ పంపాలన్నారు. రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా పకడ్బందీగా పూర్తి చేయాలని సర్వే పూర్తి అయిన గ్రామాలలో హద్దురాళ్లను తప్పనిసరిగా పాతించాలని సర్వేయర్లకు సూచించారు. సర్వే పూర్తయిన ప్రతి గ్రామానికి హద్దురాళ్లు తప్పకుండా నాటించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. ఏదైనా సమస్యతో అర్జీదారులు సచివాలయానికి వచ్చినప్పుడు వారి సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తులను ఎట్టి పరిస్థితులలో పెండింగ్లో ఉంచరాదన్నారు. జిల్లాలో 4జి మొబైల్ టవర్స్ ఏర్పాటుకు సంబంధించి స్థలాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న 4జి టవర్స్ కు సంబంధించి కంబైన్డ్ సర్వే ఎంత పూర్తి చేశారు, ఎన్ని టవర్స్ ప్రతిపాదించారు, ఎన్ని సైట్లు స్వాధీనం చేశారు, ఇంకనూ మిగిలినవి ఎన్ని తదితర వివరాలను తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. 4జి టవర్స్‌కు సంబంధించి వెంటనే స్థలాలు గుర్తించి ఇవ్వాలన్నారు. గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఎంపిడిఒలు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇకెవైసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్లు సంబంధిత అధికారులు పక్కాగా పకడ్బందీగా మెయింటైన్ చేయాలన్నారు. రిజిస్టర్‌లలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో తప్పకుండా సంతకాలు చేయించి రెండు రోజులు లోపల తమకు పంపాలన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులన్నీ గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చేసిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు బిల్స్ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ఎంపిడిఒలకు సూచించారు. గడప గడపకూ మన ప్రభుత్వంలో అందిన సమస్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, డిపఒ ధనలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఇ ప్రసన్నకుమార్, హౌసింగ్ పీడీ శివయ్య, ల్యాండ్ అండ్ సర్వే ఎడి జయరాజ్, పాల్గొన్నారు.










