ప్రజాశక్తి-గోరంట్ల మండలంలోని మల్లాపల్లి, జీనవాండ్లపల్లి సమీపంలో ఉన్న జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బసంత్‌కుమార్ సూచించారు. ఈమేరకు శనివారం ఆయా కాలనీలను పరిశీలించి లబ్ధిదారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు అవగాహన కల్పించి త్వరగా పూరి చేయించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ఆయా కాలనీల్లో విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఒకవేళ ఇప్పటికూ పూర్తయిన ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. మల్లాపల్లి లేఔట్‌లో 300 గృహాలు మంజూరు కాగా ఇప్పటివరకు 14 మాత్రమే పూర్తయ్యాయన్నారు. మరో 127 ఇళ్లు పునాదుల స్థాయి, 16 మంది లబ్ధిదారులు గోడల నిర్మాణం వరకూ, 50 మంది లబ్ధిదారులు టాప్ లెవల్ వరకూ పూర్తి చేశారని స్థానిక అధికారులు వివరించారు. జీనవాండ్లపల్లి లేఔట్‌లో 415 ఇళ్లుమంజూరుకాగా 160 మంది పునాదుల వరకు, 81 మంది గోడల వరకు, 66 మంది టాప్ వరకు, 22 మంది పూర్తిగా ఇళ్లు నిర్మించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చంద్రమౌళి, డిఇ నాగరాజు, తహశీల్దార్ రంగనాయకులు, ఎంపిడిఒ రఘునాథ్‌గుప్తా, హౌసింగ్ ఎఇ జగదీష్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న కలెక్టర్ బసంత్‌కుమార్










