ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి
ప్రజాశక్తి-అల్లూరు : జగనన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి మృదుల పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశమై పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు గృహ నిర్మాణాల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అలాగే వారి సమస్యలు తెలుసుకుని నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సమావేశాలకు రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అల్లూరు నగర పంచాయతీ కమిషనర్ ఫణికుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మనందరి సంయుక్త కృషితో పూర్తిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపిడిఒ శ్రీదేవి మాట్లాడుతూ నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికను అందించాలని తెలియజేశారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఎఇ అబ్దుల్ జమీల్, తదితరులున్నారు.










