Feb 04,2023 19:58

లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి-రాయచోటి: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా నారాయణరెడ్డిపల్లి జగనన్న కాలనీ లేఔట్‌లో వచ్చే వారంలోగా ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాలని అధికారులను కలెక్టర్‌ గిరీష్‌ ఆదేశించారు. శనివారం రాయచోటి అర్బన్‌ పరిధిలోని నారాయణరెడ్డిపల్లి జగనన్న కాలనీ లేఅవుట్‌లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించారు. ముందుగా కాలనీ లేఔట్‌లో ఎన్ని బస్తాల సిమెంట్‌ నిల్వ ఉంది, ఇంటికి కావాల్సిన ఇతర సామగ్రి వంటి వివరాలను కలెక్టర్‌ హౌసింగ్‌ పీడీని అడిగి తెలుసుకున్నారు. కాలనీ లేఔట్‌లో 6420 ఇళ్ల నిర్మాణంలో బిబిఎల్‌ దశలో 1822 ఇళ్లు, బిఎల్‌ 3185, ఆర్‌ఎల్‌ 281, ఆర్‌సి 232, ఇంకా మిగిలిన దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు రావటం లేదని లబ్ధిదారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా, ఇళ్ల నిర్మాణానికి నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ ను కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్‌ఎల్‌ స్టేజిలో ఉన్న ఇండ్లన్నీ త్వరగా పూర్తి చేయాలన్నారు. సెంట్రింగ్‌ చేసే మేస్త్రీలకు రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షల వరకు రుణం ఇప్పించాలని ఎల్‌డిఎంను కలెక్టర్‌ ఫోన్లో ఆదేశించారు. జగనన్న కాలనీ లే అవుట్‌లో పాఠశాల, ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, హౌసింగ్‌ పీడీ శివయ్య, ఎపిఎస్‌పిడిసిఎల్‌ ఎస్‌ఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.