జిల్లాలో సా..గుతున్న నమోదు
మూడు సార్లు గడువు పొడిగించినా సాగని ప్రక్రియ
వేల మంది రైతులు నమోదుకు దూరంగానే...
నెలాఖరుకు వంద శాతం అనుమానమే
ప్రజాశక్తి-రాయచోటి : ఇకెవైసి రైతులకు తప్పనిసరి. జిల్లాలో నమోదు అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికి మూడు సార్లు గడువు పొడిగించినా జిల్లాలో అనుకున్న స్థాయిలో నమోదు ప్రక్రియ సాగలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 34.4 శాతంలోపే ఇకెవైసి నమోదైనట్లు సమాచారం. రైతుల అవగాహనా లోపానికి తోడు సాంకేతిక పరమైన ఇబ్బందులు కూడా నమోదుకు ప్రతిబంధకంగా మారాయి. ఇకెవైసి నమోదులో అంతులేని నిర్లక్ష్యం కారణంగా అర్హులందరికీ సాయం అందకుండా పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నెల చివరితో ఇకెవైసి గడువు ముగుస్తుందని అధికారులు చెబుతుండటంతో రైతులు ప్రక్రియను పూర్తి చేసుకోని పక్షంలో సాయానికి దూరం కానున్నారు.
పది రోజులే గడువు..
ఇకెవైసి పూర్తి చేసేందుకు గడువు పది రోజులు మాత్రమే ఉంది. ఇందులో రెండు రోజులు సెలవు దినాలు ఉన్నాయి. జిల్లాలో రబీ పంటలకు సంబంధించి సాధారణ విస్తీర్ణం 68,729 ఎకరాలు. 51765.96 ఎకరాల్లో పంటలు సాగుచేశారు. ఇకెవైసి చేసుకోవాల్సిన రైతులు 28,367 మంది ఉండగా ఇప్పటి వరకు 10,324 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇంకా 18,043 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంది. కేవలం 34.4 శాతం మాత్రమే ఇకెవైసి నమోదైంది. ఇంకా నమోదు చేసుకోవాల్సింది 65.6 శాతం మంది ఉన్నారు. గడువు ఈనెల 28వ తేదీతో ముగుస్తున్నది.
ప్రతిబంధకాలు ఇవీ..
ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నంబరు లేనివారికి ఇకెవైసి ప్రక్రియ జరగడం లేదు. కుటుంబంలో ఒకరికి పిఎం కిసాన్ సాయం అందుతున్నా ఇతర సభ్యులు నమోదు చేసుకోవడం లేదు. విదేశాలలో ఉండడం, వేలిముద్రలు సరిపోకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల కూడా అనుకున్న స్థాయిలో ఇకెవైసి జరగకపోవడానికి అడ్డంకిగా మారాయి. వీటన్నింటికీ తోడు సరిపడ స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రైతులకు అవగాహన కల్పించేవారు కరువవడం కూడా ఇబ్బందిగా మారింది. గతంలో అందరికీ ఈ సాయాన్ని కేంద్రం అందించేది. వచ్చే నెలలో అందించే సాయానికి కచ్చితంగా ఇకెవైసి చేయిచుకోవాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పడం, ఇప్పటికీ ఆ ప్రక్రియ 34.4 శాతానికి మించకపోవడం వేలాది మంది రైతులు అందే ఆ కాస్త సాయానికి కూడా దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. రైతులు కూడా ఇకెవైసి చేయించుకునే విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వ్యవసాయశాఖ కోరుతోంది. మీసేవా కేంద్రాలలోను, సచివాలయాలలోనూ ఇకెవైసి ప్రక్రియను చేపడుతున్నారని, ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే గ్రామ వ్యవసాయ సహాయకుడిని సంప్రదించాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం విషయంలో ఆందోళన చెందనవసరం లేదని దశలవారీగా ఇకెవైసి చేయించుకున్న అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.
రైతుందరూ ఇకెవైసి చేసుకోవాలి
ప్రతి రైతూ ఇకెవైసి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇ-క్రాప్ నమోదు చేస్తే ప్రభుత్వం నుంచి రావలసిన పరిహారం, సబ్సిడీ వంటి సదుపాయాలు అందుతాయి. సమసయం ఉందని, రైతులు వెంటనే ఇకెవైసి చేసుకోవాలి.
- ఉమామహేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి, రాయచోటి.










