Feb 04,2022 09:17
  • 5 నుంచి సహాయ నిరాకరణ శ్రీ 6 అర్థరాత్రి నుంచే సమ్మె

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : న్యాయమైన పిఆర్‌సి కోసం ఉద్యోగులు, ఉపాధ్యా యులు చేపట్టిన చలో విజయవాడ విజయవంతమైంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వేలాదిమంది విజయవాడకు చేరుకున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతోపాటు, ఆర్‌టిసి, విద్యుత్‌రంగ, వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులు, కార్మికులు కూడా తరలివచ్చారు. గత రెండురోజులుగా ప్రభుత్వ నిర్బంధం పెరగడంతో మారువేషాల్లో పలువురు ఉద్యోగులు వచ్చారు. అందరూ గాంధీనగర్‌, హనుమాన్‌పేట ప్రాంతాల్లోకి చేరుకుని 9.30 గంటల సమయానికి ఒక్కసారిగా ఎన్‌జిఓ కార్యాలయం వద్దకు వచ్చారు. పావుగంటలోనే వేలాది మంది చేరుకున్నారు. ఎన్‌జిఓ కార్యాలయం నుండి బిఆర్‌టిఎస్‌ రోడ్డు వద్దకు ప్రదర్శన చేరుకునే సమయానికి వీరి సంఖ్య భారీగా పెరిగింది. సీతన్నపేటలో బారికేడ్లు పెట్టి అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బిఆర్‌టిఎస్‌ రోడ్డు పూర్తిగా నిండిపోయింది.
 

                                            తక్కువ అంచనా వేయొద్దు : బండి శ్రీనివాసరావు

పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆటోపైనుండే ఉద్యోగ సంఘాల నేతలు ప్రసంగించారు. ఎపి ఎన్‌జిఓ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులను తక్కువ అంచనా వేయవద్దన్నారు. తాము ప్రభుత్వాన్ని బెదిరించడం లేదని, సమస్యలు పరిష్కరించాలనే కోరుతున్నామని చెప్పారు. సలహాదారులతో జరిపే చర్చలు ఉపయోగం లేదని, ముఖ్యమంత్రే నిర్ణయ తీసుకుని సమస్యను పరిష్కరించాలని అన్నారు. పిఆర్‌సి పోరాట కమిటీ చేపట్టిన ఉద్యమం జీతాలు, డిఎ, ఐఆర్‌తో ఆగిపోదని, సిపిఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించేంత వరకు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. సిపిఎస్‌ ఉద్యోగులకు 13 లక్షల మంది ఉద్యోగులు భాసటగా నిలుస్తారని తెలిపారు.
 

                                          జగన్‌కు కనువిప్పు కలగాలి : ఓబులేసు ఓబులేసు

ప్రభుత్వ బెదిరింపులు, పోలీసుల ఆంక్షలు, అరెస్టులను ఖాతరు చేయకుండా చలో విజయవాడకు భారీగా తరలివచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను చూసైనా సిఎం వైఎస్‌ జగన్‌కు కనువిప్పు కలగాలని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అన్నారు. ఉద్యగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.
 

                                                 పరిపక్వత లేనిదెవ్వరికో. . : బొప్పరాజు

పరిపక్వత ఎవరికి లేదోనన్న విషయం ఉద్యోగులతో పాటు ప్రజలందరికీ తెలిసిపోయిందని ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. చీకటి జిఓలను రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని చెప్పడం పరిపక్వతలేనట్లా అని ప్రశ్నించారు. ఉద్యోగుల వెనుక ఎవరో ఉన్నారంటూ ప్రజలకు తప్పుడు సంకేతాలివ్వా లనుకున్న ప్రభుత్వ ప్రయత్నం బెడిసికొట్టిందని చెప్పారు. ఐదుపెండింగ్‌ డిఎలను కొత్త పేస్కేల్‌లో కలపి చూపించడం ద్వారా జీతాలు పెరిగాయంటూ ప్రభుత్వం దొంగ లెక్కలు వేస్తోందని చెప్పారు. సిపిఎస్‌ను రద్దు చేస్తామని చెప్పి, రెండున్నర సంవత్సరాలైనా ఆ హామీని సిఎం వైఎస్‌ జగన్‌ అమలు చేయలేదన్నారు. చలో విజయవాడను భగం చేసేందుకు ప్రభుత్వం విఫలయత్నం చేసిందని, పోలీసులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టినా, షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా వారికీ పోరాట కమిటీ అండగా ఉంటుందని బొప్పరాజు తెలిపారు.

                                ప్రభుత్వం అబద్దాలు చెప్పడం మానుకోవాలి : నక్కా వెంకటేశ్వర్లు

ఇప్పటివరకు శాంతియుత పోరాటమే చేశామని, అవసరమయితే భగత్‌సింగ్‌ వారసులుగా వీధి పోరాటాలు కూడా చేస్తామని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పే అబద్ధాలు, కల్లబొల్లి మాటలు అంగీకరించబోమని తెలిపారు. ఫ్యాప్టో కలెక్టరేట్ల ముట్టడికి 65 వేల మంది ఉపాధ్యాయులు వచ్చారని, చలో విజయవాడకు లక్ష మంది వచ్చారని తెలిపారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, తాము దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. చీకటి జివోలను రద్దు చేసి తక్షణమే చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. అశుతోష్‌ మిశ్రా నివేదిక ఇవ్వకపోతే 5వ తేది నుంచే ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ద్ధమని హెచ్చరించారు.
 

                                     పాలన స్తంభింపజేస్తాం : ఫ్యాఫ్టో ఛైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు

వేతన సవరణ కమిటీ కాకుండా పే రివర్స్‌ కమిటీ చేసి అన్ని కోతలు విధించారని ఫ్యాఫ్టో ఛైర్మన్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు విమర్శించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు కూడా రివర్స్‌ టెండరింగ్‌ ఇచ్చారని ఈ ఉద్యమానికి ఫ్యాప్టో కలెక్టరేట్ల ముట్టడే నాంది అని చెప్పారు. 6వ తేదీ నుంచే సమ్మెకు వెళుతున్నామని, పరిపాలనను స్తంభింపచేస్తామని హెచ్చరించారు.
 

                                      చిరుద్యోగులపై చిన్నచూపు : జనరల్‌ హృదయరాజు

ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం వల్ల నిరాశకు లోనయామని ఎపి ఎన్‌జిఓ జెఎసి సెక్రటరీ జనరల్‌ హృదయరాజు తెలిపారు. ప్రభుత్వం చిరు ఉద్యోగులపై చిన్నచూపు చూస్తూ ఉన్న ప్రయోజనాలు లేకుండా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉద్యోగులకు వైరం తెచ్చే ప్రయత్నాలు సబబు కాదని సూచించారు.

                                                    ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు

ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నరసింగరావు అన్నారు. పోరాటాలు చేయకుండా ఏదీ సాధించలేమని రాష్ట్ర చరిత్ర అదే తెలిపిందన్నారు. ఇప్పటికే స్టీలు ప్లాంటు ఉద్యమం ఏడాది నుండి సాగుతోందని, విజయం సాధించి తీరుతామని అన్నారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సిఐటియు తరుపున సంపూర్ణ మద్దతు తెలిపారు.
                                                                                                  - సిహెచ్‌.నరసింగరావు

                                                  ఇదో కొత్త చరిత్ర : కెఆర్‌ సూర్యనారాయణ

ఉద్యోగుల ఉద్యమం కొత్త చరిత్రకు నాంది పలికిందని ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కె.ఆర్‌ సూర్యనారాయణ అన్నారు. ఉద్యమం నిన్నటి వరకు ఒక ఎత్తయితే, రేపటి నుంచి మరొక ఎత్తు అని చెప్పారు. పిఆర్‌సి జిఓలు వెనక్కి తీసుకోవడంతో పాటు హెచ్‌ఆర్‌ఎ పాత శ్లాబులు కొనసాగింపు, సిపిఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌, ఓట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు ఎప్పటి నుంచి చేస్తారో చెప్పేవరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడొద్దని ఉద్యోగులు తమను హెచ్చరించారని చెప్పారు. ఉద్యోగులకు రక్షణ కవచంగా నాలుగు జెఎసిలు అండగా నిలుస్తాయన్నారు. గత రెండున్నరేళ్లుగా ఉద్యోగ సంఘాల మధ్య ప్రభుత్వం నాలుగు స్తంభాల ఆట ఆడిందన్నారు. ఇక ఆ ఆట సాగదని, ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత వారికి అంతకు ముందు వస్తున్న పెన్షన్‌ లేకుండా పోయిం దని, గతంలో అందుతున్న వైద్య సౌకర్యం నిలిచిపోయిందన్నారు.

                                       ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం : వెంకట్రామిరెడ్డి

02

ప్రభుత్వం దిగివచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పిఆర్‌సి స్ట్రగుల్‌ కమిటీ నాయకులు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఎవరికి వారుగా సమస్యలపై పోరాడితే ప్రభుత్వం పట్టించు కోలేదని, ఈ నేపథ్యంలోనే నాలుగు జెఎసిలకు కలిసి ఐక్య వేదికగా పోరాటం సాగిస్తున్నామన్నారు. ఈనెల 7నుంచి సచివాలయ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్తారని చెప్పారు. పిఆర్‌సి వల్ల జీతం పెరిగందని ప్రభుత్వం చెబుతోందని, పే స్లిప్పులను చూసిన ఏ ఉద్యోగి కూడా తమకు జీతాలు పెరిగాయని భావించడం లేదన్నారు.

                                            ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదు

ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని కోరితే వారిని నిర్భందించడం, అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయమని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ ఆందోళనకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలతోపాటు స్వతంత్య్ర ఎమ్మెల్సీల తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. దీనిపై శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధిగా ఉన్న తనను కూడా పోలీసులు గుంటూరులో నిర్బంధించారని, వేరేచోట ఉండి తాను సమావేశానికి రావాల్సి వచ్చిందని తెలిపారు. ఇటువంటి విధానాలు ప్రభుత్వానికి మంచిది కాదని వివరించారు.
                      - కె.ఎస్‌.లక్ష్మణరావు

                                               బస్సులు నిలిపేస్తాం : ఆర్‌టిసి నేతలు

ప్రభుత్వం ఆర్‌టిసి ఉద్యోగులను నిలువునా మోసం చేసిందని ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు, ఎపి జెఎసి అమరావతి సెక్రటరీ జనరల్‌ వై.వి.రావు, ఎన్‌ఎంయు నాయకులు శ్రీనివాసరావు తెలిపారు. ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఇప్పటికీ కార్పొరేషన్‌ పద్దతులే అనుసరిస్తున్నారని తాము ప్రభుత్వ ఉద్యోగులమో, కార్పొరేషన్‌ ఉద్యోగులమో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వాలను చాలా చూశామని, న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఆరోతేదీ అర్థరాత్రి నుండి బస్సులు నిలిపేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో నాయకులు శివారెడ్డి, ఆస్కారరావు, అరవపాల్‌, కృష్ణయ్య, ప్రసాదు, రమేష్‌, కమలాకరరావు, భానూప్రసాదు, పొలారి తదితరులు మాట్లాడారు.