May 27,2023 16:51

ధర్నా చేపడుతున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : ఇఎస్‌ఐ ఆస్పత్రిని బలోపేతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామంజులు, జిల్లా ఉపాధ్యక్షులు సి.రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజంపేట కేంద్రంగా 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని, వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని, కార్మికులకు సౌకర్యాలను కల్పించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసంఘటితరంగ కార్మికుల వైద్యం కొరకు కార్మికుల జీతాలలో డబ్బు కట్‌ చేసి స్లిప్పులు ఇస్తున్నారు తప్ప ఆ డబ్బులు రిజర్వ్‌ బ్యాంకులో వేసి పెట్టుబడిదారులకు రాయితీ రూపంలో ఇస్తున్నారని తెలిపారు. అసంఘటితరంగ కార్మికులకు వైద్యసదుపాయాలు కల్పించలేదని పేర్కొన్నారు. రాజంపేటలో వేలాదిగా ఇఎస్‌ఐ నోచుకోని కార్మిక, ఉద్యోగుల సంక్షేమం కోసం ఈయస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలన్నారు. ఇఎస్‌ఐ స్కీమ్‌ ద్వారా కార్మికులు, ఉద్యోగులకు మందులు, సిక్‌ లీవులు, నిరుద్యోగభతి, పెన్షన్లు వంటి తదితర సౌకర్యాలకొరకు తమ వేతనం లోని కొంత నగదును ఎంప్లారు మెంట్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ పేరుతో రిజర్వ్‌ బ్యాంక్‌లో జమ చేసిన మొత్తం లక్షా పదివేల కోట్లు ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా కూడా పరికరాలు, మందులు, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా పేద కార్మికులకు అరకొరగా అందుతున్న వైద్యాన్ని కూడా పూర్తి ప్రైవేటీకరణ చేసే దశలో భాగంగా డిస్పెన్సరీలను నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు. కార్మికులు ప్రజలతో కలసి ఈయస్‌ ఐ పథకాన్ని బలోపేతం చేసే వరకు ప్రభుత్వాల పై ఒత్తిడి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు ఓబయ్య, ప్రసాద్‌, లక్ష్మిదేవి, మధు, సాలమ్మ, నాగరాజ, శ్రీను, రాములమ్మ, వరలక్ష్మి తో పాటు పలువురు మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.