ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలోని ఇఎస్‌ఐ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ కోరారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను సిపిఎం, సిఐటియు నాయకులు కలిసి ఇఎస్‌ఐ అసుపత్రిలో నెలకొన్న సమస్యలను వివరించారు. ఈసందర్భంగా ఇంతియాజ్‌తో పాటు సిఐటియు జిల్లా కార్యదర్శి ఇఎస్ వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో కార్మికుల కోసం ఉండే ఒకే ఒక అసుపత్రి ఈఎస్‌ఐ అసుపత్రి అని, ఈ అసుపత్రిలో మందులే కాదు..సిబ్బంది సైతం లేరని అన్నారు. దీంతో కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదని, వెంటనే పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి అవసరమైన మందులను సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడ హిందూపురం ప్రాంతంలో ఉందన్నారు. ఇక్కడ దాదాపు 50వేల మందికి పైగా కార్మికులు వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్నారన్నారు. ఇందులో దాదాపు 20వేల మందికి పైగా ఇఎస్‌ఐ సేవలు పొందుతున్నారని చెప్పారు. కోట్నురు, హిందూపురం రెండు ఇఎస్‌ఐ డిస్పెన్సీరీలను ప్రభుత్వం మంజూరు చేసినా స్థలం లేకా పోవడంతో రెండు డిస్సెన్సీరీలు ఒకే చోట నిర్వహిస్తున్నారని తెలిపారు.. ఇద్దరు వైద్యులు ఉండాల్సిన చోట కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారన్నారు. దీంతో పాటు ఇతర సిబ్బంది 19 మంది ఉండాల్సిన చోట కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారని చెప్పారు. మందుల విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నిత్యం కార్మికులకు అవసరమైన షుగర్, బిపి, థైరాయిడ్ ఇతర అత్యవసర మందులు సైతం సరఫరా చేయడం లేదన్నారు. దాదాపు లక్ష మందికి వైద్య సేవలు అందల్సిన అసుపత్రిలో వెయ్యి మందికి సైతం సేవలు అందడం లేదని వాపోయారు. స్థానిక ఇఎస్‌ఐ ఆసుపత్రిలో వైద్య సేవలు సరిగా అందకపోవడంతో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేయించుకుని దానికి సంబంధించిన బిల్లులు కార్మికులు ఇఎస్‌ఐ అధికారులకు సమర్పిస్తే, ఆరు నెలలు గడిచిన బిల్లులు మంజూరు చేయడం లేదని విమర్శించారు. ప్రతి నెల కార్మికులు ఇఎస్‌ఐ ప్రీమియం చెల్లిస్తూ, వైద్య సేవల కోసం మళ్లీ అప్పులు చేసి, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఇఎస్‌ఐ కార్డు ఉన్నవారికి వైద్య సేవలు అందించడం లేదన్నారు. దీనికి ప్రధాన కారణం బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడమేనని అన్నారు. ప్రతినెల ప్రభుత్వం ఇఎస్‌ఐ రూపంలో కార్మిక వేతనాలు నుంచి కోత విధించి ఖజానా నింపుకుంటుందే తప్ప కార్మికుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 50 పడకలతో ఇఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ అసుపత్రి హిందూపురానికి మంజూరైనా స్థలం లేక పోవడంతో ఇంత వరకు వాటి పనులు ప్రారంభం కాలేదన్నారు. అసలు దానికి సంబందించి ఎవరు ఎటువంటి సమచారం ఇవ్వడం లేదని, వీటిపై సమగ్రంగా అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరించి కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ వెంటనే అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్పీ శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు సదాశివరెడ్డి, సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, ప్రీకాట్ బి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జయరాం రెడ్డి, కోశాధికారి నందీష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.










