ప్రస్తుతం అన్ని ఇండిస్టీల్లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే సీనియర్ డైరెక్టర్లు యాక్టింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఓ వైపు డైరెక్షన్లో ఉన్నతంగా రాణిస్తూనే.. మరోవైపు నటనవైపు అడుగులు వేస్తున్నారు. అంతేకాదు తమ ప్రతిభను చాటుకుంటూ తమదైన గుర్తింపుతో రాణిస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ సైతం తాజాగా నటుడిగా మారిపోయాడు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు సెల్వరాఘవన్. ఈ నేపథ్యంలో ఆయన గురించిన విశేషాలు..
ఎప్పటికప్పుడు ఫిలిమ్ ఇండిస్టీల్లో ఓ ట్రెండ్ నడుస్తూ ఉంటుంది.. ఒక్కో సందర్భంలో ఒక్కో ట్రెండ్.. కాకపోతే ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్‌కి కొనసాగింపుగా.. సీనియర్ డైరెక్టర్లు యాక్టింగ్ వైపు అడుగులు వేస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తెలుగులో తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు అలాంటి ప్రయత్నం చేసి, సక్సెస్ అయ్యారు. తమిళ్లో గౌతమ్ మీనన్ నటుడిగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. డైరెక్టర్‌గా సినిమాలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. మరో డైరెక్టర్ సముద్ర ఖని కూడా ఇపుడు తెలుగు, తమిళ్లో మంచి నటుడిగా పేరు సంపాదించాడు. కోలీవుడ్‌లో దర్శకుడిగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో కథానాయకుడిగా, ఆ తర్వాత ప్రతినాయకుడిగా మారిపోయారు ఎస్.జె.సూర్య. తాజాగా డైరెక్టర్ సెల్వ రాఘవన్ కూడా నటన వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఈయన నుంచి వచ్చే సినిమాలకి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ట్రెండ్‌కి ముందుగా సినిమాలు తీస్తాడు అనే పేరు కూడా ఉంది.
సెల్వరాఘవన్ తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు. తన తండ్రి దర్శకత్వంలో మొదటి సినిమా 'తుళ్లువదో ఇల్లమై' కోసం స్క్రిప్ట్ మీద పనిచేసిన రాఘవ తెలుగులో వరుసగా 7/జి బందావన్ కాలనీ, 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' వంటి ప్రేమ కథా చిత్రాలు తీశారు. అయితే సెల్వ రాఘవన్ తాను నటుడిగా మారుతున్నట్టు గతేడాది డిసెంబర్లోనే ప్రకటించారు. 'రాకీ' ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న 'సాని కాయిధమ్' చిత్రంలో సెల్వ రాఘవన్, కీర్తి సురేశ్ ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవల తెలుగులో 'చిన్ని' పేరుతో విడుదలై, మంచి విజయం సాధించింది. ఇందులో కీర్తి సురేశ్ సోదరుడిగా తన నటనతో రాఘవన్ మంచి మార్కులే కొట్టేశాడు. అంతేకాదు ఇటీవల తమిళ హీరో విజయన్ నటించిన 'బీస్ట్' చిత్రంలోనూ ఓ కీలకపాత్రలో నటించి, అందరినీ మెప్పించారు.
వారికి రుణపడి ఉంటా..
'పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాను. 23 ఏళ్లు దర్శకుడిగా ఉన్న నేను తొలిసారి నటుడిగా మారాను. ఇదంతా అభిమానుల చలవే, వారికి రుణపడి ఉంటా' అని సెల్వ రాఘవన్ ఇటీవల తాను నటించిన చిత్రం విజయోత్సవం సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే 'దర్శకులు అంటే కేవలం దర్శకత్వం మాత్రమే చేయాలా. మన నటులు ఏమన్నా నటించడం మాత్రమే చేస్తున్నారా? ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు నటుడిగా ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో చూద్దాం.' అంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు అభిమానులు దీనిపై చర్చ కూడా ప్రారంభించారు.
యూనిట్ మొత్తం ఫోర్స్ చేసింది..
'ఎవరి ఊహకందని విధంగా 'చిన్ని' చిత్రం కథ ఉంటుంది. మీరు జరిగేది ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆడియెన్స్‌కు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అయితే ఈ మూవీలో ఒక ముఖ్యపాత్ర చేయాల్సిన యాక్టర్ చివరి నిమిషంలో రాలేదు. దీంతో మా యూనిట్ మొత్తం నన్ను ఆ పాత్ర చేయమని ఫోర్స్ చేశారు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం నుంచే చిత్రీకరణ జరగాలి. అంతేకాకుండా అది చాలా ముఖ్యమైన పాత్ర. మళ్లీ ఆ రోల్ చేసేందుకు వేరే ఎవరూ లేరు. అందుకే ఎలాంటి ప్లాన్ లేకుండా ఇందులో నటించాల్సి వచ్చింది.' అని ఇంటర్వ్యూలో తెలిపాడు సెల్వ రాఘవన్.
'యుగానికి ఒక్కడు'కి మించి..
కాగా 'యుగానికి ఒక్కడు' కొనసాగింపుగా సెల్వ దర్శకత్వం వహించే హై రేంజ్ బడ్జెట్ మూవీ 'ఏఓ-2'. ఈ అడ్వెంచరస్ మూవీలో కార్తీ ప్లేస్‌లో ధనుష్ నటిస్తున్నారు. ఒక ఏడాది మొత్తం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనంతరం ఈ సినిమా వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రేక్షకుల ముందుకు 2024లో రాబోతుందని ఆ మధ్య డైరక్టర్ సెల్వ అనౌన్స్ చేశాడు. మొదటి పార్ట్‌ని మించే ఎపిక్ అడ్వెంచర్ అంటున్న ఈ సినిమా ఏ రేంజ్లో రచ్చ చేస్తుందో చూడాలి.
కాగా, ప్రస్తుతం తన తమ్ముడు ధనుష్‌తో రూపొందిస్తున్న 'నానే వరువేన్'లోనూ సెల్వ రాఘవన్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సెల్వ కనిపించనున్నారు. సెల్వ సినిమాల్లో నటిస్తూనే ఆయన దర్శకత్వంలో ఇంకా ఎంతో మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం.
పేరు : సెల్వ రాఘవన్
ఇతర పేర్లు : శ్రీ రాఘవ, సెల్వ రాఘవన్ కస్తూరి రాజా
వృత్తి : దర్శకుడు, నటుడు
పుట్టిన తేదీ : 1977, మార్చి 5
పుట్టిన ప్రాంతం : తెనీ, తమిళనాడు
నివాస ప్రాంతం : చెన్నరు
చదువు : మెకానికల్ ఇంజనీరింగ్
భార్య : గీతాంజలి రామన్
పిల్లలు : లీలావతి, ఓంకార్
తల్లిదండ్రులు : కస్తూరి రాజా, విజయలక్ష్మి
తోబుట్టువులు : ధనుష్, కె.విమలా గీత, కార్తిక దేవి