ప్రజాశక్తి -పెనుకొండ : పారిశుధ్య కార్మికుల ఉద్యోగాల పర్మినెంట్, సమాన పనికి సమాన వేతనం తదితర సమస్యల పరిష్కారం కోసం మార్చి 17న కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ కోరారు. మంగళవారం పెనుకొండ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ ,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి పాల్గొని మాట్లాడారు. ఈనెల 17న సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులు మున్సిపల్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్నారన్నారు. ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయకుండా పాలకవర్గాలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే6 నెలల్లో కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని, ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీల వర్షం కురిపించారన్నారు. గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మార్చి 14 నుండి 21 తేదీ వరకు జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప, నగర పంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు రిక్షా నరసింహులు, చిన్న వెంకటేష్, తిప్పన్న, ఇ.వెంకటేష్, గజేంద్ర, ముత్యాలు, నరసింహులు, శాంతమ్మ, నాగమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.










