May 08,2022 12:46

హీరోయిన్ల శరీరాకృతిపై నెటిజన్లు కామెంట్స్‌ చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సెలబ్రిటీల విషయంలో 'బాడీ షేమింగ్‌' తరచూ వినిపిస్తున్న మాట.. ఏ ఒక్కరు కొంచెం లావు అయినా కొంచెం సన్నబడినా బాడీ షేమింగ్‌ పేరుతో విమర్శలు చేస్తుంటారు. అయితే కొందరు హీరోయిన్స్‌ బాడీ షేమింగ్‌ కామెంట్స్‌ పెద్దగా పట్టించుకోరు. కొంతమంది మాత్రం సీరియస్‌గా తీసుకొని, ఇబ్బందిపడుతుంటారు. మరికొందరు మాత్రం వాటిని ధైర్యంగా తిప్పికొడుతుంటారు. తాజాగా ఆ జాబితాలో చేరారు హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌.

 



పేరు : మృణాల్‌ ఠాకూర్‌
ఇతర పేర్లు : గోలీ
పుట్టిన తేదీ : ఆగస్టు 1, 1992
పుట్టిన ప్రాంతం : థూలే, మహారాష్ట్ర
నివాస ప్రాంతం : ముంబై
చదువు : బ్యాచిలర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియా
తల్లిదండ్రులు : ఉదరుసింగ్‌ ఠాకూర్‌, వందనా ఠాకూర్‌
తోబుట్టువులు : మందర్‌ ఠాకూర్‌, లోచన్‌ ఠాకూర్‌

 

ఈ ట్రోల్స్‌ నన్నేమీ చేయలేవు..



       ముంబైకి చెందిన బాలీవుడ్‌ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం నార్త్‌లో వరుస సినిమాలతో ఆడియెన్స్‌ను అలరిస్తోంది. 2014లో మరాఠి సినిమాతో తెరంగేట్రం చేశారు మృణాల్‌. ఆ తర్వాత బాలీవుడ్‌ బాటపట్టారు. తన గ్లామర్‌, నటనకు మంచి మార్కులే పడటంతో ఆఫర్లూ వరుసకట్టాయి. మృణాల్‌ ఠాకూర్‌ హిందీలో నటించిన తొలిచిత్రం 'లవ్‌ సోనియ' మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'సూపర్‌ 30' చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. అప్పటి నుంచి వరుస సినిమాలతో అలరిస్తోన్నారు. పిప్పా, ఆంఖ్‌ మిచోలీ వంటి ప్రముఖ చిత్రాల్లోనూ పనిచేశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీయేస్ట్‌ హీరోయిన్‌గా లైఫ్‌ లీడ్‌ చేస్తోన్నారు. అయితే తొలినాళ్లలో తాను ఎలా ఉన్నానో.. ప్రస్తుతం అలానే ఉన్నానని.. దీంతో కొందరు నెటిజన్లు 'బాడీ షేమింగ్‌' చేస్తున్నారని ఇటీవల వాపోయారు. కాగా 2019లో నాని నటించిన 'జెర్సీ' మూవీని హిందీలో షాహీద్‌ కపూర్‌తో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. హిందీ జెర్సీలో షాహీద్‌ సరసన మృణాల్‌ ఠాకూర్‌ చక్కగా నటించారు. ఏప్రిల్‌ 22న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. అంతేకాదు ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. షాహీద్‌, మృణాల్‌ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు ఆసక్తికర విషయాలు మృణాల్‌ అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు చప్పట్లు కొడుతున్నవాళ్లే గతంలో తనను విమర్శించారంటూ చెబుతున్నారు మృణాల్‌.
 

                                                                  తొలినాళ్లలోనే ఎదుర్కొన్నా..

అయితే, ఇండిస్టీకి వచ్చిన తొలినాళ్లలోనూ బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నట్టు తెలిపారు. మొదట్లో కాస్త బరువుగా ఉండటంతో తగ్గేందుకు ప్రయత్నించానని, దీంతో బరువు తగ్గుతున్న కొద్దీ తన ముఖం చిన్నగా అయిపోయిందని, ఆ తర్వాత శరీరం పైభాగం, ఆ తర్వాత కిందిభాగం సన్నగా అవుతూ వచ్చిందని తెలిపారు. కాగా ప్రస్తుతం అలానే ఉన్నానని అన్నారు. అయితే తన శరీరాకృతిని చూసి చాలామంది కుండ (మట్కా)లా ఉన్నావనేవారని తెలియజేశారు. దీంతో తనకు చాలా బాధగా ఉండేదన్నారు. నటిగా ఫిట్‌గా ఉండటం అత్యవసరం అనిపించి, చాలా ప్రయత్నాలు చేసినట్టు తెలిపారు.
 

                                                                  అప్పుడే ధైర్యం వచ్చింది..

ఓసారి అమెరికా వెళ్లినప్పుడు చాలామంది తనను ఇండియన్‌ కర్దాషియన్‌ అని పిలిచారంట. అంతేకాదు తనలాంటి శరీర సౌష్టవం కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారని తెలిసి ధైర్యం వచ్చిందని చెప్పారు. అంతేకాదు ఈ ట్రోల్స్‌ తననేమీ చేయలేవన్న నమ్మకం కలిగిందని తెలిపారు మృణాల్‌. అప్పటి నుంచే తన ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నట్లు తెలిపారు.
 

                                                         క్రీడా స్ఫూర్తే ఆత్మస్థైర్యాన్ని నింపింది..

తాజా ఇంటర్వ్యూల్లో తను ఇండిస్టీకి రాకముందు పడిన విషయాల గురించి చెప్పుతూ ఎమోషనల్‌ అయ్యింది. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఇంటినుండి దూరంగా వచ్చేసిన తను.. ముంబై మహానగరంలో ఒంటరిగా జీవించానని.. ఆ టైంలో తను పడిన బాధలు, కష్టాలు చెప్పుకోలేనివని చెబుతూ.. ఆ బాధలను ఫేస్‌ చేయలేక చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని చెప్పుకొచ్చారు. ఇక చదువుకునే రోజుల్లో ప్రతిరోజూ లోకల్‌ ట్రైన్‌లోనే తిరిగేవారట.. ఇక ఆ టైంలో కూర్చుందామన్నా ఒక్క సీటూ దొరికేది కాదని.. ఆ టైంలో ఎందుకో సడెన్‌గా ట్రైన్‌లో నుంచి దూకేయాలనిపించేదని చెప్పుకొచ్చారు మృణాళిని. అలా ఎన్నో బాధలు, కష్టాలు చూసిన మృణాల్‌ ఠాకూర్‌.. ఇప్పుడిలా ఉందంటే తనలోని క్రీడా స్ఫూర్తే.. ఓటమిని, విజయాన్ని బ్యాలెన్స్‌ చేసుకునే తత్వాన్ని ఇచ్చిందని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలపట్ల ఇష్టం ఉండేదని చెప్పారు. బాస్కెట్‌బాల్‌ కూడా ఆడేదాన్నని, కొన్ని జోనల్‌ మ్యాచ్‌లలో కూడా పాల్గొన్నట్లు తెలిపారు. అయితే ఫుట్‌బాల్‌ తనకు ఇష్టమైన క్రీడని, మానసిక ప్రశాంతత కోసం క్రీడల్లో తాను ఎప్పుడూ చురుకుగా ఉంటానని మృణాల్‌ చెప్పుకొచ్చారు.
        మృణాల్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ బడా హీరోల సరసన నటిస్తున్నారు. ఇక త్వరలోనే తెలుగు ప్రేక్షకులకూ పరిచయం కానున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది ఈ మూవీ ఉపశీర్షిక. మృణాల్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.