తూర్పు గోదావరి జిల్లాలో మూడేళ్ళ క్రితం ఏసుప్రభు పిలుస్తున్నాడంటూ ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. అదే టైమ్‌లో ఢిల్లీలో మోక్షం కోసం ఒకే కుటుంబం లోని పదకొండు మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మధ్య తమిళనాడులో ఒక ముస్లిం మహిళ, ఆరేళ్ల కొడుకుని దేవునికి బలిచ్చింది. మదనపల్లి జంట హత్యలను ప్రేరేపించిన ఆ బాబా ఎవరు? ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి? వీటి వెనుక బాబాలు, పాస్టర్ల బోధనలు, సూక్తులు దాగి ఉన్నాయి. వీరికి ఈ లోకంతో పని లేదు. 'మనం పరలోక వాసులం, అక్కడ సుఖంగా జీవించవచ్చ'ని భక్తులు ఆత్మహత్యలు హత్యలు చేసుకు నే విధంగా వీరి సూక్తులు బోధనలు ఉంటున్నందున భక్తులు ప్రేరేపింపబడుతున్నారు. ఈ సంఘటలపై ఒక్క బాబాగాని, ఒక ఫాస్టరుగాని, ఒక మంత్రిగాని నోరెత్తలేదు.
ఎందుకంటే వీరంతా తోడు దొంగలు కనుక. మూఢనమ్మకాల నిర్మూలనా చట్టంతోనే ఇలాంటి మోసకారుల ఆట కట్టేయొచ్చు. మోసపు ప్రకటనలు ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్ల పైనా, వ్యక్తుల పైనా, ఆ పరికరాలను అమ్ముతున్న సంస్థల పైనా నేరాలను మోపి ''ది డ్రగ్స్ అండ్ బ్లాక్ మేజిక్ మహారాష్ట్ర యాక్ట్'' కింద చర్యలు తీసుకొమ్మని మహారాష్ట్ర హైకోర్ట్ ఔరంగాబాద్ బెంచ్ ఈ మధ్య ఒక చక్కని తీర్పు ఇచ్చింది. అక్కడ మూఢనమ్మకాల నిర్ములనా చట్టముంది.
గత జనవరి 25న మదనపల్లిలో అలేఖ్య, సాయి దివ్య అనే ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అమ్మాయిలను...భక్తి ఉన్మాదం పెరిగిన వారి తల్లిదండ్రులే అత్యంత కిరాతకంగా చంపారు. తల్లిదండ్రులు ఇద్దరూ బాగా చదువుకున్నవారు. వారి ఇంటి నిండా బాబాల బొమ్మలు, బాబాల సూక్తులతో నిండిన పుస్తకాలు ఉన్నాయి. తండ్రి పురుషోత్తమ నాయుడు జగ్గీ వాసుదేవ బాబాకి భక్తుడు. తన ఆదాయంలో 10 శాతం బాబాకి జమ చేస్తాడు. చనిపోయి కూడా మరలా బతకొచ్చనేది వీరి నమ్మకం. కూతుళ్లను చంపమని ఏ బాబా బోధించాడు? ఇంతవరకు ప్రభుత్వం ఈ గుట్టు తేల్చకపోవటం విచారకరం. హత్యకు ముందు ఆ నలుగురు ఫోన్ల సంభాషణలు సేకరించినట్లైతే ఏ బాబా బోధనలు, సూక్తులు ఆ జంట హత్యలను ప్రేరేపించాయో ఖచ్చితంగా బయటపడుతుంది. ఈ చిన్న పనిని కూడా ప్రభుత్వం ఎందుకు చెయ్యటంలేదు? ప్రభుత్వాలు, బాబాలు, పాస్టర్లు అందరూ తోడుదొంగలే. అందుకే ఆ పని చెయ్యటం లేదు. అంతే కాదు. 'రంగు రాళ్లు ధరిస్తే జీవితాలు బాగుపడతాయి. పేరు మార్చుకుంటే జీవితాలు బాగుపడతాయి. అష్టలక్ష్మి యంత్రాలు, రుద్రాక్షలు, హనుమాన్ చాలీసా, మోకాళ్ల నొప్పులకు మేమిచ్చిన మందు తీసుకుంటే నిమిషాలలో గోడలు దూకేస్తారు...' అంటూ టీవీలలో ప్రకటనలు! వీటి మీద నియంత్రణ లేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు, గత ఎన్నికలకు ముందు....సంఖ్యాశాస్త్రం ముసుగులో పేరు మార్చుకుంటె నీకు ఢోకా లేదని ఎవడో చెప్పగా...తన పేరును యడియారప్ప అని మార్చుకున్నారు. అయినా ఆయన రాజీనామా చెయ్యక తప్పలేదు. 2010 ప్రాంతంలో కూడా ఇలాంటిదే జరిగింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సంగతి. తన సహచర మంత్రి గాలి జనార్ధన రెడ్డితో కలసి ప్రకాశం జిల్లాలో దొంగ రామదూత ఆశ్రమానికి వచ్చారు. ఆ తరువాత ఇద్దరికీ మంత్రి పదవులు పోయాయి. ఇద్దరూ జైలుకు కూడా వెళ్లారు. ఇదంతా ఎందుకంటే బాబాల చుట్టూ తిరిగినా కష్టాలు తీరవు. పేర్లు మార్చుకున్నా జైళ్ళకి పోక తప్పదని తెలియచేసేందుకు మాత్రమే.
మరికొంతమంది మోసగాళ్లు బాబాల వేషంతో జాతకాలు చెప్తామంటూ యాగాలు, కాల సర్ప దోషమంటూ మహిళలతో నగ పూజలు చేయిస్తూ లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఇలాంటి వారు రాష్ట్రమంతా వున్నారు. నాయుడుపేటలో వాసమ్మ బాబా, చిత్తూరు జిల్లాలో కల్కి భగవాన్, ప్రకాశం జిల్లాలో రామదూత స్వామి...ఇలా ప్రతి జిల్లా లోనూ ఆమాంబాబతు స్వాములు ఉన్నారు. తెలంగాణ పోలీసులు మొన్న అమాయక మహిళలను మోసం చేస్తున్న విష్ణు చైతన్య అనే దొంగబాబాను అరెస్టు చెశారు. ఇదే తెలంగాణ పోలీసులు విజయవాడలో, జాతకాలు, కాల సర్ప దోషాలు, నగ పూజలు అంటూ మహిళలను మోసం చేసిన కానాల అచ్చిరెడ్డి అనే బాబాను అరెస్టు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని దొంగ బాబాల గుట్టు రట్టు చెయ్యవలసిన అవసరముంది. బాబాల వలన మోసపోతున్న అమాయకులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. కనుక ప్రభుత్వం...కర్ణాటక, మహారాష్ట్ర మాదిరి మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఏర్పరచి, అందులో పైన పేర్కొన్న మోసకారులను కూడా చేర్చి కఠినంగా శిక్షించాలి.
- నార్నె వెంకట సుబ్బయ్య










