Apr 28,2022 07:49

కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదులతో వెలుగు చూస్తున్న అక్రమాలు
సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు లుక్‌ అవుట్‌ నోటీసులకు సిఫార్సు
ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : 
విశాఖలో మూడు నెలల క్రితం అలజడి రేపిన హయగ్రీవ భూముల వివాదంపై కేంద్ర ఆర్థిక శాఖకు గతంలో బాధితులు ఫిర్యాదు చేయడంతో సంబంధిత శాఖ విచారణ జరిపి ఈ నెల 25న ఇంకా భారీ అక్రమాలకు హయగ్రీవ పాల్పడినట్టు తేల్చింది. తప్పుడు లెక్కలు చూపించిన సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడు సహా మరొక డైరెక్టర్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా వీరికి లుక్‌ అవుట్‌ నోటీసుల జారీకి సిఫార్సు చేసింది. వీరు దేశం దాటి వెళ్లకుండా ఉండేలా ఉచ్చుబిగించడంతో ఈ వివాదానికి కొంత వరకూ తెరపడినట్లే అయింది.

విశాఖలోని ఎండాడ కొండపై సర్వే నెంబరు 92/3లో గల 12 ఎకరాలను 2008లో హయగ్రీవ సంస్థ అధినేత చిలుకూరి జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి ఎకరా రూ.45 లక్షలకు కొన్నారు. వయోవృద్ధులకు హౌసింగ్‌ ప్రాజెక్టు కోసమని తక్కువకు కొనుగోలు చేసి మూడేళ్లలో ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉండగా నిర్మాణాలు చేపట్టలేదు. కొద్ది సంవత్సరాలుగా కొంత మందితో బేరాలు కుదుర్చుకుని రూ.కోట్లకు ప్లాట్లను క్రమంగా అమ్ముకుంటూ వచ్చారు. ఈలోగా భాగస్వాముల మధ్య ఆర్థికపరమైన విభేదాలు తలెత్తడం, ఆ భూమిలో నిబంధనల ఉల్లంఘనలు భగ్గుమనడంతో ఈ ఏడాది ఫిబ్రవరి తొలి వారంలో హయగ్రీవ అధినేతపై ఆరోపణల ఉచ్చు బిగుసుకోవడం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక శాఖకు మూడు నెలలుగా ఫిర్యాదులు వెల్లువలా రావడంతో విచారణ చేపట్టాక తాజా రుణాలు మంజూరు చేసి బకాయిపడ్డ బ్యాంకులకు సైతం కేంద్ర ఆర్థిక శాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కరూర్‌ వైశ్యా బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు ఫిర్యాదుల మేరకు ఆర్‌బిఐ కూడా రంగంలోకి దిగింది. బ్యాంకులకు తనఖా పెట్టిన ఆస్తులను వేలం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. గతంలో ఆస్తుల వేలంపై హైకోర్టుకు వెళ్లి జగదీశ్వరుడు స్టే తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఆయనపై ఈ తరహా ఫిర్యాదులు ఉన్నందున క్రిమినల్‌ చర్యల దిశగా జగదీశ్వరుడిపై కేంద్ర ఆర్థిక శాఖ సిఫార్సు చేసింది. హయగ్రీవపై అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఇక్కడ భూముల విలువ రూ.200 కోట్లకు పైగానే ఉండడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. డెబిట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ కోర్టులో కేసు నమోదైంది.