హైదరాబాద్ : తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఇప్పటికే టిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటూ ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీ చేయనుందని తెలంగాణ జన సమితి (టిజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఆగస్టు నెలాఖరులో ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. టిజెఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందులో విలీనం చేసే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.










