Mar 26,2022 01:37

అనకాపల్లిలో మోటారు సైకిల్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న లోకనాథం

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో చేపట్టనున్న దేశ వ్యాప్త సమ్మెను, 28న తలపెట్టిన విశాఖ బంద్‌ను జయప్రదం చేయాలంటూ జిల్లాలో శుక్రవారం ప్రచారం హోరెత్తింది. అనకాపల్లి, అచ్యుతాపురం ప్రాంతాల్లో మోటారు సైకిల్‌ ర్యాలీలు, జీపు జాతాలు నిర్వహించారు. పలుచోట్ల నాయకులు సమ్మె పోస్టర్లును ఆవిష్కరించారు. సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు.
ప్రజాశక్తి - అనకాపల్లి : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు సంఘం, సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కె.లోకనాథం ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోందని అన్నారు. అటువంటి ప్రయత్నాలను పోరాటాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా పెట్రోలు, డీజిల్‌ ధరలను మోడీ సర్కారు పెంచిందంటూ మండిపడ్డారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది కార్మికులు ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, జిల్లాలో ఉన్న సుగర్‌ ఫ్యాక్టరీల మూసివేతను నిరసిస్తూ ఈ నెల 28న విశాఖ జిల్లా బంద్‌కు బిజెపియేతర రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయన్నారు. ఆయా కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, సిఐటియు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి పిఎన్‌వి.పరమేశ్వరరావు, బి.ఉమా మహేశ్వరరావు, త్రిమూర్తులు, ఎంపి.నాయుడు, వైఎం.శివ ప్రసాద్‌, దుర్గ, వృత్తి సంఘాల జిల్లా నాయకులు గంటా శ్రీరామ్‌, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి బి.నూక అప్పారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్‌.రమణ, తరుణ్‌ పాల్గొన్నారు. ఈ మోటారు సైకిల్‌ ర్యాలీ ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి బయలుదేరి నెహ్రూ చౌక్‌ జంక్షన్‌, శారదా బ్రిడ్జి, రామచంద్ర థియేటర్‌ జంక్షన్‌, సర్వకామదాంబ పార్క్‌ జంక్షన్‌, పెరుగు బజార్‌, రింగ్‌ రోడ్డు మీదుగా సాగింది.
ఆర్‌ఎఆర్‌ఎస్‌లో జరిగిన సమావేశంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం టైం స్కేల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణతాల నందీశ్వరరావు మాట్లాడారు. వ్యవసాయ యూనివర్సిటీలో పని చేస్తున్న టైం స్కేల్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరికి వ్యతిరేకంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలిపారు. సమావేశంలో సిఐటియు డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మళ్ల సత్యనారాయణ, పిఎన్‌వి.పరమేశ్వరరావు, సిపిఎం నాయకులు బాలకృష్ణ, గంటా శ్రీరామ్‌, వారాది సత్యనారాయణ, అప్పారావు పాల్గొన్నారు.
ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద శ్రీ దుర్గ భవాని ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ, నాయకులు కృష్ణ బాబు, నాగరాజు, నాని, రాంబాబు, వై.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అచ్యుతాపురం మండల కేంద్రంలో శుక్రవారం జీపు జాతాను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం తెచ్చిన లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలన్నారు. కార్మిక చట్టాలు, హక్కులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి రొంగలి రాము, మండల కార్యదర్శి కె.సోమినాయుడు, రైతు సంఘం నాయకులు కె రామ సదాశివరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.
పరవాడ : లంకెలపాలెంలో జరిగిన సమావేశంలో ఆటో యూనియన్‌ మండల గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నర్సింగరావు, వెంకటరమణ, ఠాగూర్‌ పాల్గొన్నారు.
అరకు రూరల్‌ : గిరిజన సంఘం కార్యాలయంలో బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడారు. మోడీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలపై విపరీత భారాలు మోపుతోందన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, నాయకులు పి.రామన్న పాల్గొన్నారు.
పాయకరావుపేట : మండల కేంద్రంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అర్జునరావు, ఎఐటియుసి నాయకులు వెలుఫే రాజా బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, నాయకులు బాబ్జీ, భద్రిరావు, రాజు, సతీష్‌, కృష్ణ, అమ్మన్నరాజు, గంగారాం పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌: మండల కేంద్రంలోని ఎంపిడిఒ, తహశీల్దార్‌, ఎంఇఒ కార్యాలయాలకు మధ్యాహ్న భోజన కార్మికులు, పంచాయతీ కార్మికులు, విఆర్‌ఎలు కలిసి సమ్మె నోటీసులు అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు వివి.శ్రీనివాసరావు మాట్లాడారు. సంఘం మండల కార్యదర్శి ఎస్‌.బ్రహ్మాజీ, పంచాయతీ కార్మికులు రాము, పరదేశి, విఆర్‌ఎలు సన్యాసిరావు, శాంతకుమారి, చిన్నా పాల్గొన్నారు.
ఆరిలోవ : ఆరిలోవ దుర్గాలమ్మ గుడి వద్ద మున్సిపల్‌ కార్మికుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు పి.వెంకటరెడ్డి మాట్లాడారు. అనంతరం దుర్గాలమ్మ గుడి నుంచి తోటగరువు వరకు పారిశుధ్య, ఆటో, తోపుడు బండ్ల కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, వి.నరేంద్రకుమార్‌, నాయకులు ఎంవి.ప్రసాద్‌, రత్నం, శ్రీను, కనకరాజు, రామలక్ష్మి, రవణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ : సిఐటియు, గిరిజన సంఘం నాయకులు మండలంలోని అరకు వారపు సంతలో సమ్మె ప్రచారం నిర్వహించారు. నాయకులు పోతురాజు, సూర్యనారాయణ మాట్లాడారు. పి.బస్సు, చందు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు : పాడేరు సంతలో సిఐటియు, సిపిఎం నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకరరావు మాట్లాడారు. నాయకులు సుందరరావు, ప్రభుదాస్‌, సూరిబాబు, శ్రీను, ప్రసాద్‌, రాంబాబు పాల్గొన్నారు.