Dec 06,2022 22:41

గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ

పుట్టపర్తి రూరల్‌ : హోంగార్డుల సేవలు ప్రశంసనీయమని ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో 60వ హోంగార్డ్స్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఎస్పీ కార్యాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. స్థానికపోలీసు పరేడ్‌ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడ పోటీల్లో ప్రతిభ కనబరచిన వారికి మొమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ హోంగార్డుల విధులు, వారు అందిస్తున్న సేవల గురించి వివరించారు. అనంతరం జిల్లాలో మృతిచెందిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున అందజేశారు.కారుణ్య నియామకం కింద వారి కుటుంబం లో ఒకరిని హోంగార్డుగా నియమించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ కెవి. రామకృష్ణ ప్రసాద్‌, పుట్టపర్తి డీఎస్పీ టిడిపి యశ్వంత్‌ , హోంగార్డుల ఆర్‌ఐ శ్రీశైలం రెడ్డి, ఎఆర్‌ అడ్మిన్‌ ఆర్‌ఐ టైటాస్‌, ఎంటిఒ నారాయణ తదితరులు పాల్గొన్నారు.